శర్వా కారు ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన టీమ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫిల్మ్ నగర్ దగ్గర శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. అయితే రాత్రి వేళ కావడంతో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉందని అందరూ భావించారు. కాని ఆ స్థాయిలో లేదని తెలుస్తోంది. ఆక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో శర్వానంద్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో శర్వానంద్ కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

ప్రమాద స్థాయి తీవ్రంగా లేకపోయిన ఆయన కండిషన్ ఏంటి అనేది బయటకి రాకపోవడంతో తీవ్ర గాయాలు తగిలినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే తాజాగా శర్వానంద్ టీమ్ నుంచి ఈ ప్రమాదంపై వివరణ వచ్చింది. ఇది చాలా చిన్న ఘటన అని ఈ ఆక్సిడెంట్ లో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.

అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ టీమ్ నుంచి ఈ రోడ్డు ప్రమాద ఘటనపై క్లారిటీ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్ రేంజ్ రోవర్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితమే శర్వానంద్ కి తన ప్రియురాలు రక్షిత్ రెడ్డితో ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఇక త్వరలో వీరి పెళ్లి వేడుక రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతోంది. ఇంతలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం కుటుంబ సభ్యులని కూడా కొంత ఆందోళనకి గురి చేసింది. ఇదిలా ఉంటే శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పెళ్లి వేడుక కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. రాజస్థాన్ లో పెళ్లి జరిగిన తర్వాత మరల ఈ మూవీ షూటింగ్ లో శర్వానంద్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.