జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. సరైన నాయకుడు లేడని అక్కడి ప్రజలు భావిస్తున్న సమయంలో తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. అన్నట్టుగానే కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టి అనేక ప్రజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక రజనీకాంత్ రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టారే తప్ప పార్టీ ప్రకటన ఎప్పుడనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ ఏడాది అక్టోబర్ లో రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని అందరు భావించినప్పటికీ, కరోనా వలన అది కాస్త పెండింగ్ పడింది.అయితే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఈ రోజు రజనీకాంత్ ..రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు. పలు విషయాలపై మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు.
జిల్లాలకు చెందిన సంఘాలతో ముచ్చటించాం. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారు. వీలైనంత త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తాను అని తలైవా చెప్పుకొచ్చారు. ఈ రోజు రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందని ఇటు మీడియా, అటు అభిమానులు, మద్దతుదారులు ఎంతో ఆశగా ఎదురు చూడగా, మరోసారి నిరాశే ఎదురైంది. కాగా, సమావేశం తర్వాత కళ్యాణ మండపం బయట ఉన్న మద్దతుదారులని పలకరించి వారికి అభివాదం తెలిపారు రజనీ