బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీశ్ రావు, సంతోష్‌రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కూటమిలో కుట్రలు పన్ని బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని కవిత మండిపడ్డారు. తన సస్పెన్షన్ కూడా అదే కుట్రలో భాగమని ఆమె వ్యాఖ్యానించారు.
నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి గమనించండి. కేటీఆర్, నేను, మీరు.. మాది రక్త సంబంధం. పదవులు పోయినా, సస్పెన్షన్ వచ్చినా ఈ బంధం ఎప్పటికీ విడదీయరాదు. కానీ కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు అంటూ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. రేపు ఇదే పరిస్థితి కేటీఆర్‌కు వస్తుందని, తరువాత కేసీఆర్‌నే బయటకు నెడతారని ఆమె హెచ్చరించారు.
హరీశ్ రావు రాజకీయ ప్రయాణంపై కూడా కవిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. “హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ఆయన చేతుల్లోనే కుట్రలు పుట్టుకొస్తున్నాయి. పాల వ్యాపారం నుంచి పెద్ద ఎత్తున లాభాలు పొందారు. మద్యం కేసులు వచ్చినప్పుడు నిందితులను కాపాడారు. కానీ కేసీఆర్‌ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు అని కవిత వ్యాఖ్యానించారు.
తనపై కుట్రలు కొత్తవి కాదని, దుబ్బాక ఉపఎన్నికలు నుంచి నిజామాబాద్, కామారెడ్డి వరకూ ప్రతిసారీ హరీశ్ రావు, సంతోష్ గ్యాంగ్ వల్లే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని కవిత అన్నారు. ఒకే విమానంలో రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కలిసి ప్రయాణించారన్నది నిజమేనా కాదా..? దానికి సమాధానం చెప్పాలి. అప్పటి నుంచే మా కుటుంబాన్ని బలహీనపరిచే యత్నాలు మొదలయ్యాయి అని ఆమె ఆరోపించారు.
కవిత తన కుటుంబంపై చూపుతున్న నిబద్ధతను స్పష్టం చేస్తూ.. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నా కన్నీరు వ్యక్తిగత దుఃఖం కాదు.. ఇది బీఆర్‌ఎస్ భవిష్యత్తు కోసం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాక, పార్టీ భవిష్యత్తు కోసం కేటీఆర్‌ను అప్రమత్తం చేస్తూ, రామన్న.. హరీశ్ రావు నక్కజిత్తుల్ని గమనించండి. వాళ్లు ఉంటేనే పార్టీకి నష్టం, కేటీఆర్ ప్రతిష్టకు చెడ్డపేరు వస్తుంది అని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ సస్పెన్షన్ తరువాత కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత కలకలం మరింత పెంచాయి. రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత ఆరోపణలతో పార్టీ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో అనే చర్చ మొదలైంది.
