బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏడుపదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతి వంటి రియాలిటీ షోస్‌తో ప్రేక్షకులని థ్రిల్ చేస్తున్నారు. కుర్ర హీరోలకు పోటీగా పని చేస్తున్న అమితాబ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే జీవితంలో ఎన్నో పోటీలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న బిగ్ బీ కరోనాని కూడా జయించారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యంకు సంబంధించి తాజాగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు.
అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారని, ఏదో ప్రమాదంలో జరిగిన గాయం వలన సోమవారం ఆసుపత్రిలో చేరారంటూ అనేక కథనాలు వచ్చాయి. మరికొన్ని మీడియాలు శనివారం నుండి ఆస్పత్రిలోనే ఉన్నారని, వైద్యుల బృందం ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతో అసలు అమితాబ్‌కు ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అభిమానులు వాకబు చేయడం మొదలు పెట్టారు. అయితే అభిమానుల ఆందోళన చెందుతున్నారన్న విషయం తెలుసుకున్న అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కొద్ది సేపటి క్రితం స్పందించారు.
నాన్న అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. నాన్న నా ముందే హ్యాపీగా ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నది నాన్న డూప్ అయి ఉంటుందని జాతీయ మీడియాతో పేర్కొన్నారు అభిషేక్. బిగ్ బీ తనయుడు ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ కొంత రిలాక్స్ అయ్యారు. దయచేసి తప్పుడు వార్తలు పుట్టించొద్దని కోరుతున్నారు. అమితాబ్ తెలుగులో మనం, సైరా చిత్రాలలో నటించారు. ఇప్పుడు నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోను కీలక పాత్ర పోషించనున్నారు. ఇక అభిషేక్ చివరగా బ్రీత్: ఇంటూ ది షాడోస్‌లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్‌బుల్’ విడుదలకు సిద్ధంగా ఉంది.