‘RRR’ సినిమా థీమ్ లా.. ‘ఉస్సేన్ బోల్ట్’ పిల్లల పేర్లు..! నెట్టింట్లో వైరల్

ఉసేన్ బోల్ట్.. జమైకా పరుగుల వీరుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న స్ప్రింటర్. అత్యంత వేగంగా పరుగు అందుకోవడంలో ఎందరో దిగ్గజాలను వెనక్కు నెట్టాడు. రీసెంట్ గా బోల్ట్ కు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇప్పటికే బోల్ట్ – కేసీ బెన్నెట్ దంపతులకు ఓ పాప ఉంది. ఇప్పుడు ఇద్దరు మగ పిల్లలు కవలలుగా పుట్టారు. అయితే.. ఇదేమంత వార్త కాకపోయినా.. తమ పిల్లలకు ఈ దంపతులు పెట్టిన పేర్లే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా థీమ్ ఫైర్ అండ్ వాటర్ లా వీరి పేర్లు ఉండటం విశేషం. దీంతో బోల్ట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పిల్లల పేర్లను బోల్ట్ సోషల్ మీడియాలో వెల్లడించడంతో వైరల్ చేసేశారు. ఇంతకీ వారి పేర్లేమిటంటే..

అమ్మాయికి ‘ఒలింపియా లైటెనింగ్ బోల్ట్’ కాగా.. మగ పిల్లలకు.. ‘సెయింట్ లియో బోల్ట్’, ‘థండర్ బోల్ట్’ అంటూ పేర్లు పెట్టాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం నాడు ట్వీట్ చేసి ఈ విషయం తెలిపాడు. భార్య, ముగ్గురు పిల్లలతో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ ముగ్గురి చిన్నారుల పేర్ల వద్ద మెరుపు చిహ్నాలు ఉంచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిన్నారుల పేర్లన్నీ ఉరుములు, మెరుపులు.. అనే అర్ధం వచ్చేట్టు పెట్టుకోవడం విశేషం.

మరోవైపు.. బోల్ట్ భార్య కేసీ బెన్నెట్ కూడా ఇన్ స్టాలో ఉసేన్ బోల్ట్ కు ఫాదర్స్ డే.. అంటూ పోస్ట్ చేసింది. ‘ఈ కుటుంబానికి నువ్వే రాక్ స్టార్. మన పిల్లలకు నువ్వు గొప్ప నాన్నవు. మేమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అంటూ తన ప్రేమను వ్యక్తపరచింది. కెరీర్ పరంగా బోల్ట్ 2017లో వీడ్కోలు పలికాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే కాదు.. అనేక రికార్డులు నెలకొల్పాడు.