గుండె ఆరోగ్యాన్ని కాపాడే నూనె.. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు..!

గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనూ పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్, బరువు, చెడు ఆహారపు అలవాట్లు… ఇవన్నీ కారణాలు. అందుకే చాలా మంది ‘‘ఏ నూనె వాడాలో?’’ అని డౌట్ అవుతుంటారు. కొందరు ‘‘విత్తన నూనెలు హానికరం’’ అని నమ్ముతుంటే, మరికొందరు ‘‘స్పెషల్ ఆయిల్’’ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు.

కానీ తాజాగా అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చేసిన పరిశోధన ఒక్కసారిగా ఈ అపోహలు తొలగించేసింది. పొద్దుతిరుగుడు, అవిసె, నువ్వులు, కనోలా విత్తనాల నుంచి తీసే నూనెలు గుండెకు మంచివని, వాటిలో ఉండే లినోలెయిక్ ఆమ్లం గుండెను రక్షిస్తుందని తేలింది. ఇండియానా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు కెవిన్ సీ చేసిన అధ్యయనంలో 1900 మందిపై పరీక్షలు చేసి, వీరి రక్తంలో లినోలెయిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటే గుండెపోటు, టైప్-2 షుగర్ దరిచేరవని నిరూపించారు. ఇది కేవలం కాగితపు సాక్ష్యం కాదు.. ప్లాస్మా టెస్టుల ఆధారంగా జరిగిన అధ్యయనం కావడం విశేషం.

పాతకాలంలో మన పెద్దలు వాడిన విత్తన నూనెలు నిజంగా శరీరానికి రక్షణ కవచమని ఇప్పుడు శాస్త్రవేత్తలే చెబుతున్నారు. విత్తన నూనెల్లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉండటం వల్ల, ఇవి శరీరానికి తేలికగా అరిగి గుండెపై ఒత్తిడి పెట్టవు. కానీ సమస్య ఏంటంటే – గతంలో ఆహార పరిశ్రమ రిఫైన్ చేసిన నూనెలను, వాణిజ్య ప్రకటనలు ‘‘హెల్తీ’’ అని ప్రచారం చేశాయి. అందుకే విత్తన నూనెలు తక్కువ ప్రాధాన్యం పొందాయి. కానీ ఇప్పుడు న్యూట్రిషనిస్టులు మళ్లీ వాటికి మద్దతు ఇస్తున్నారు.

న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం పొద్దుతిరుగుడు, నువ్వులు, అవిసె విత్తన నూనెలు గుండెకు మంచివే. కానీ మితంగా వాడాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరే. ఎవరైనా డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. తక్కువ కొవ్వు, ఎక్కువ లినోలెయిక్ ఆమ్లం.. ఇవే గుండెకు నిజమైన రక్షణ కవచం. కాబట్టి విత్తన నూనెలను తెలివిగా వాడితే, హార్ట్ యాటాక్ దరిచేరదు. డాక్టర్ సలహా తీసుకుని, నూనె మార్చండి.. గుండె బాగుంటుంది, జీవితం చురుకుగా ఉంటుంది.