మనలో చాలామంది గురువారం రోజున సాయిబాబాను పూజిస్తారనే సంగతి తెలిసిందే. గురువారం సాయిబాబాను పూజిస్తే కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. సంతానం లేని దంపతులు సాయిబాబాను పూజిస్తే సంతానం కలుగుతుందని భావిస్తారు. భక్తితో సాయిబాబాను పూజించి ఉపవాసం ఉన్నవాళ్లు సాయిబాబా మహిమ వల్ల కోరినవన్నీ జరుగుతాయని విశ్వసిస్తారు.
ఎవరైతే ఉపవాసం చేయాలని అనుకుంటారో వాళ్లు తమ మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఉపవాసం చేసే సమయంలో చెడు ఆలోచనలు చేయడం, చెడు మాటలు మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఉపవాసం చేసేవాళ్లు నీళ్లు తీసుకోవచ్చు. రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్లు పండ్లు లేదా ఒకపూట భోజనం తీసుకుంటూ ఉపవాస నియమాలను పాటించడం ద్వారా మంచి జరుగుతుంది.
ఉపవాసం చేసేవాళ్లు ప్రసాదాలను ఒక్కరే తినకుండా అందరికీ పంచితే మంచిదని చెప్పవచ్చు. పూజ పూర్తి చేసిన తర్వాత హారతి ఇవ్వడంతో పాటు పూజకు అవసరం అయిన అన్ని వస్తువులను కలిగి ఉండాలి. గురువారం రోజున నిద్ర లేచి ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. శుభ్రమైన దుస్తులను ధరించి ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది.
శుభ్రమైన పసుపు వస్త్రాన్ని కింద పరిచి విగ్రహానికి ముందు దీపం, ధూపం, అగరుబత్తీలు వెలిగించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. సాయిబాబాకు కుంకుమ తిలకం దిద్దడంతో పాటు సాయి చాలీసా, సాయి వ్రత కథ చదివితే మంచిది. మన దగ్గర ఉన్న సంపదలో కొంత మొత్తాన్ని ఇతరులకు దానం చేస్తే మేలు జరుగుతుంది.