పడకగదిలో పూజా గృహం పెట్టారా.. ఇవి పాటించకపోతే శాంతి దూరమవుతుందట..!

ఇంట్లో పూజా గృహం అంటే కేవలం ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు.. కుటుంబంలో సానుకూల శక్తులు, ఆధ్యాత్మిక శాంతి, మానసిక సౌఖ్యం కోసం అత్యంత ముఖ్యమైన ప్రదేశం. కానీ చిన్న నివాసాలు, స్థల పరిమితి కారణంగా చాలామందికి పూజా మందిరాన్ని పడకగదిలోనే ఏర్పాటు చేస్తుంటారు. గుజరాత్ వాస్తు నిపుణుడు అన్షుల్ త్రిపాఠి చెబుతున్నట్టు, పడకగదిలో పూజా గృహం ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు వస్తాయి.

పూజా గృహం పవిత్రత, శక్తి ప్రసారానికి సంబంధించిన ప్రదేశం. పడకగది విశ్రాంతి, నిద్రకు ప్రత్యేకమైనది. వీటి శక్తులు భిన్నంగా ఉండటంతో, ఒకే గదిలో ఉంచితే కుటుంబ జీవితం, వైవాహిక సంబంధాలు, మానసిక శాంతి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. చిన్న వివాదాలు, పెద్ద గొడవలు, మానసిక ఉద్రిక్తతలు, భగవంతుపై విశ్వాసంలో తగ్గుదల ఇలా సమస్యలు ఏర్పడతాయి.

కానీ కొన్ని పరిస్థితుల్లో, పడకగదిలోనే పూజా గృహం ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్గదర్శకాలు పాటించడం క్షేమకరం అంటున్నారు పండితులు. ముందుగా, పూజా గృహాన్ని ఈశాన్య దిశలో ఉంచడం అత్యంత శుభకరమని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఆ గదిలోకి బూట్లు, చెప్పులు ఉంచకూడదని సూచిస్తున్నారు. ఇక ఎప్పుడూ ఆ గది గందరగోళంగా ఉండకూడదని తెలిపారు. ఇక విగ్రహాలను చిన్నగా ఉండాలని.. ధూళి, మలినాలు రాకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా సూచిస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు పాదాలు దేవుని వైపు కాకుండా ఉండాలంటున్నారు. అవసరమైతే కర్టెన్ లేదా వస్త్రంతో కప్పి పవిత్రతను కాపాడాలని పండితులు అంటున్నారు.

ప్రతిరోజూ దీపాలు, అగరబత్తీలు వెలిగించడం ద్వారా శక్తి ప్రసారం కొనసాగుతుంది. శుభ్రమైన, ప్రకాశవంతమైన, నిశ్శబ్దమైన పూజా గృహం కుటుంబంలో సానుకూల శక్తిని పెంపొందించి, మానసిక, ఆధ్యాత్మిక స్థిరత్వం అందిస్తుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా, పడకగదిలో ఉన్నా, పూజా గృహం ఇంట్లో శాంతి, పవిత్రత, ధ్యానం, ఆరోగ్యం అందించగలదు. నిపుణుల సూచనల ప్రకారం, పూజా గృహం సరైన విధంగా ఏర్పాటు చేయడం ప్రతి కుటుంబానికి అవసరం, ఇది చిన్న మార్పులు అయినా పెద్ద ఫలితాలను ఇస్తుంది.