Cooking Oils: ఈ నూనె వాడితే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది.. తస్మాత్ జాగ్రత్త..!

మన వంటగదిలో రోజూ ఉపయోగించే వంట నూనెలు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయా..? లేక శరీరాన్ని లోపల్నుంచి నెమ్మదిగా నాశనం చేస్తున్నాయా..? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న. హార్ట్ ప్రాబ్లెమ్స్‌, మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో… మనం వాడుతున్న ఆయిల్స్‌ ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయడం ఊహించని ప్రమాదాలకు దారి తీస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నూనెలలో చాలా వరకు ప్రాసెస్డ్ ఆయిల్స్‌. ఇవి ఫ్యాక్టరీల్లో అధిక ఉష్ణోగ్రతలతో, రసాయనాలతో తయారవుతాయి. ఆ ప్రాసెసింగ్ ప్రక్రియలో సహజ పోషకాలు నశించి, ఆరోగ్యానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ ఉత్పత్తి అవుతాయి. సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌, మొక్కజొన్న, కనోలా లాంటి ఆయిల్స్‌… పేరుకు పోషకమైనవిగా కనిపించినా, అవి నిజానికి గుండెపోటు, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు మార్గం వేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్డ్ ఆయిల్స్‌లో ఎక్కువగా ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఒమేగా-3తో సమతుల్యత కోల్పోయేలా చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రెస్టారెంట్లలో ఆయిల్‌ను పదే పదే మళ్లీ వేడి చేయడం వల్ల ఆల్డిహైడ్స్‌ అనే విషపూరిత పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన డీఎన్‌ఏకి నేరుగా హాని చేసి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

అంతేగాక, ఇలాంటి నూనెలు వాడటం వల్ల శరీరం సహజంగా చేసే రిపేర్‌ ప్రక్రియలు కూడా దెబ్బతింటాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. మన వంటగదిలో ఉన్న ఆయిల్‌ బాటిల్‌… ఆరోగ్యానికి అసలు సంపద కాదు, సైలెంట్‌ పాయిజన్‌ కావచ్చునన్న ఆలోచన తప్పు కాదు.

అయితే పరిష్కారం ఏంటి? సరైన ఆయిల్‌ను ఎంచుకోవడమే. కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్‌, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌, కొబ్బరి నూనె, నెయ్యి, ఆవ నూనె, అవకాడో ఆయిల్ లాంటివి తక్కువ ప్రాసెసింగ్‌ వల్ల గుణాలను నిలబెట్టుకుంటాయి. ఇవి ఒమేగా-3, ఒమేగా-6 మధ్య సమతుల్యతను కాపాడి, శరీరాన్ని రక్షిస్తాయి. నిత్యం వంటకాల్లో వాడే ఆయిల్‌పై తీసుకునే ఒక చిన్న నిర్ణయం… పెద్ద ఆరోగ్య సమస్యల్ని నివారించగలదు. కాబట్టి ‘తినే తినే నూనె’ విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్యమే నిజమైన సంపద.