అమ్మాయి పుడితే ఆరు వేల రూపాయలు ఇస్తామన్న కేంద్రం.. స్కీమ్ బెనిఫిట్స్ ఎలా పొందాలంటే?

money4-getty

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా అమ్మాయి పుడితే కేంద్రం ఏకంగా 6000 రూపాయలు ఇవ్వనుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఈ స్కీమ్ వర్తింపు జరగనుందని సమాచారం అందుతోంది. పీఎం మాతృ వందన యోజన స్కీమ్ ద్వారా కేంద్రం మూడు దశల్లో 5,000 రూపాయలు ఇస్తోంది.

తొలి కాన్పు కోసం ఈ స్కీమ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ను సవరిస్తూ రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే కూడా ప్రయోజనం పొందేలా కేంద్రం కొత్త స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ అమలు విషయంలో ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రెండో కాన్పులో కవలలు జన్మించి ఇద్దరిలో ఒకరు అమ్మాయి అయినా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

తల్లీదండ్రులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు అబార్షన్ లను తగ్గించాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోందని తెలుస్తోంది. పీఎం మాతృ వందన యోజన స్కీమ్ లో కూడా స్వల్పంగా మార్పులు జరిగాయి. ఇకపై గర్భం దాల్చిన సమయంలో 3000 రూపాయలు, ప్రసవం జరిగిన 14 వారాలకు 2,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారని సమాచారం.

కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో కూడా నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 60 : 40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ వల్ల మహిళలకు, ఆడపిల్లల తండ్రులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.