మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని ప్రత్యేకంగా లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కొందరికి ఎంత నీళ్లు తాగినా డీహైడ్రేషన్ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే నీరు తాగే పద్ధతి సరిగ్గా లేకపోతే శరీరానికి తగినంత ప్రయోజనం దొరకదు. నిపుణులు చెబుతున్నట్టుగా నీరు తాగే సమయం, పద్ధతి అన్నివి సమానంగా ముఖ్యం. మన శరీరం సుమారు 60 శాతం వరకు నీటితో నిండిపోయి ఉంటుంది. ఈ సమతుల్యత కోల్పోతే చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే ప్రధాన సాధనం కూడా నీరే. అలాగే ఉష్ణోగ్రతను నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మెదడుకు శక్తినివ్వడం ఇవన్నీ తగినంత నీరు తాగినప్పుడే సజావుగా జరుగుతాయి.
ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం చాలా ముఖ్యం. రాత్రంతా నిద్రించిన తరువాత శరీరంలో నీటి లోపం వస్తుంది. అందుకే రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తే శరీరం డీటాక్స్ అవుతుంది, రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి. కానీ ఒకేసారి ఎక్కువగా నీళ్లు తాగేయడం మంచిది కాదు. అలా చేస్తే మూత్రపిండాలకు అదనపు భారమవుతుంది. కొద్దికొద్దిగా, విరామం తీసుకుంటూ నీళ్లు తాగితేనే శరీరం వాటిని సరిగా గ్రహిస్తుంది.
నిపుణుల సలహా ప్రకారం, ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే ఈ పరిమాణం వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా మారుతుంది. వ్యాయామం చేసే వారు, ఎక్కువసేపు బయట పని చేసే వారు మరింత నీళ్లు తాగాలి. వేసవిలో ద్రాక్షరసం, కొబ్బరి నీరు, లస్సీ, నిమ్మరసం వంటివి కూడా శరీరానికి హైడ్రేషన్ అందించడంలో సహాయపడతాయన్నారు.
అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం తీన్నప్పుడు కాకుండా.. విడిగా తాగితేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీళ్లు తాగకూడదు. అది జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. భోజనానికి ముందు లేదా కొంతసేపటి తరువాత నీళ్లు తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి గంటకు కనీసం ఒక గ్లాసు నీరు తాగేలా రిమైండర్ పెట్టుకోవచ్చు. అలాంటి అలవాటు ఏర్పడితే డీహైడ్రేషన్ సమస్య దరిదాపుల్లోకి రాదు. మొత్తానికి, నీరు తాగే పరిమాణం మాత్రమే కాదు, దాన్ని తాగే పద్ధతి, సమయమే అసలు ఆరోగ్య రహస్యం. “ఎంత నీళ్లు తాగినా డీహైడ్రేషన్” అనిపిస్తే, మీరు తాగే విధానం సరిగా ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి.
