నోటి దుర్వాసన సమస్యతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా… ఈ చిట్కాలు మీకోసమే?

నోటి దుర్వాసన రాకూడదు అంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యం అయితే కొందరు ఎన్నిసార్లు బ్రష్ చేసిన నోటి దుర్వాసన కారణంగా నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు.ఇలా తరచు నోటి దుర్వాసనతో బాధపడేవారు ఏం చేసినా ఫలితం లేదని నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ సమస్యను దూరం పెట్టి అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడవచ్చు.

సాధారణంగా నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం, నోటి ఇన్ఫెక్షన్లు, సరిగా బ్రష్ చేసుకోకపోవడం, జీర్ణ సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ ,పొగ తాగడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నోటి దుర్వాసన సమస్యను నిర్లక్ష్యం చేస్తే అనేక ఇన్ఫెక్షన్లతో నోటి క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది. కావున నోటి దుర్వాసన సమస్యను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం , రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా బ్రష్ చేసుకొనే అలవాటు చేసుకోవాలి. వీలైతే ఆహారం తిన్న ప్రతిసారి నోటిని శుభ్రం చేసుకోవడం, నోటిని పుక్కిలించిడం మంచిది.
నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది. కావున ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం చేసిన తర్వాత చిటికెడు సోంపు తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే రెండు తులసి ఆకులను పుదీనా ఆకులను బాగా నమిలితే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియాతో పోరాడి నోటి దుర్వాసనను అరికడుతుంది.పొగాకు నమలడం, పొగ తాగడం వంటివి చేస్తే దంతాలకు హాని జరిగి చిగుళ్ల సమస్య ఏర్పడుతుంది దాంతో నోటి దుర్వాసన ప్రారంభమవుతుంది. కావున వీటికి దూరంగా ఉండడం మంచిది. నోటి దుర్వాసన సమస్య మరీ తీవ్రతరంగా ఉంటే దంత వైద్య నిపుణులును సంప్రదించాలి.