ఈ ఐడి తో వచ్చిన రిక్వెస్ట్ ని ఓకే చేశారా.. ఇక అంతే సంగతులు..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రెండు మూడు సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేరగాళ్లు కూడా తమ పంతా మార్చుకొని కొత్త విధానాలలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇదివరకు హ్యాకింగ్‌ చేసి ఖాతాల్లోని డబ్బులు కాజేసిన కేటుగాళ్లు ఇప్పుడు భయమే పెట్టుబడిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ వేదికగా కొత్త దందా మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫేస్బుక్ లో పోర్న్‌స్టార్‌ ఫొటోలు.. విదేశీ యువతుల ఫొటోలు డీపీలుగా పెట్టి యువకులకు అందాలతో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. మొదట న్యూడ్ వీడియో కాల్స్ చేసి..తర్వాత డబ్బులు దండుకోవడం, విదేశాల్లో జాబ్స్ పేరుతో నిండా ముంచడం, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు అని దోచుకుంటున్నారు.

‘అలీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌’ అనే నకిలీ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా సైబర్‌ నేరగాళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పేజీకి అనుబంధంగా ఉన్న ఎన్నో నకిలీ అకౌంట్లలో కూడా పోర్న్‌స్టార్‌ ఫొటోలు ఉన్నాయి. అందమైన విదేశీ యువతుల ఫొటోలు, మాజీ పోర్న్‌స్టార్‌ల ఫొటోలు, ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలకు డీపీలుగా పెట్టి.. సైబర్‌ నేరగాళ్లు ఆకర్షిస్తున్నారు.ఇలా ఆ పేజీల్లో ఉన్న అందమైన అమ్మాయిల ఫోటోలకు ఎట్రాక్ట్‌ అయ్యారా..? అంతే..మీ లైఫ్‌ స్పాయిల్. మొదట న్యూడ్ కాల్స్ చేసే ఆ తర్వాత వాటి ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఎన్నో ఫేస్బుక్ అకౌంట్లకు ఒకటే కామన్ పేరు ఉంటుంది.

ఒక అకౌంట్‌లో అలీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌ అని ఉంటే.. దానికి అనుసంధానమైన ఖాతాలకు’ఫౌండేషన్‌ ఫర్‌ ది పూర్‌’ అనే పేరు కామన్‌గా ఉంటుంది. అలీస్‌ స్థానంలో పేర్లు మారుతూ ఉంటాయి. ఈ అకౌంట్స్ లో అమ్మాయిల అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అబ్బాయిలను రెచ్చగొడుతున్నారు. అబ్బాయిలు ఆశపడి అందంగా కనిపిస్తున్న ఆ ఫొటోలపై క్లిక్‌ చేస్తే..కింద వాట్సాప్‌ లింక్‌ ఓపెన్‌ అవుతుంది. కొందరికి టెలిగ్రామ్‌ లింక్‌ ఇస్తున్నారు. దానిని ఓపెన్‌ చేయగానే రెచ్చగొట్టే ఫొటోలతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అలా పరిచయం పెంచుకొని న్యూడ్‌ వీడియోకాల్స్‌ చేసి, దానిని రికార్డు చేసి, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు లాగుతున్నారు . ఇలాంటి ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి రిక్వెస్టులు వస్తే..స్పందించవద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.