Croatia: రూ.12 రూపాయలకే లగ్జరీ ‘ఇల్లు’ అమ్మకం..! అప్పుడే.. 17 మంది కొనేశారు..

Croatia: ఇల్లు కట్టాలన్నా.. కొనాలన్నా లక్షల్లోనే ఖర్చు. లగ్జరీ ఇల్లు కావాలంటే కోట్లలోనే. అందుకే ఇల్లు కట్టి చూడు.. అనే సామెత కూడా ఉంది. అయితే.. ఇందుకు భిన్నంగా 12 రూపాయలకే ఇల్లు ఇస్తామంటుంది ఓ దేశ ప్రభుత్వం. రెంట్ కో, కొన్నాళ్లో కాదు.. కేవలం.. రూ.12 ( పన్నెండు రూపాయలు ) కడితే విలాసవంతమైన ఇల్లు మన పేరుమీద శాస్వతంగా రాసిచ్చేస్తామంటోంది. ఆశ్చర్యంగా ఉందా? కానీ.. ఇది నిజమే. అయితే.. ఓ ఇల్లేంటి 100 రూపాయలకు ఎన్నొస్తే అన్ని ఇళ్లు కొనేద్దాం.. పడుంటాయి అనుకుంటున్నారా? అయితే.. మీరు క్రొయేషియా వెళ్లాల్సిందే. ఆ దేశమే ఈ ఆఫర్ ప్రకటించింది. కొన్ని షరతులతో.. అవేంటంటే..

క్రొయేషియా యూరప్ ఖండంలోని దేశం. అక్కడ లెగ్రాడ్ అనే పట్టణంలోని ఇళ్లనే 12 రూపాయలకు ఇస్తామని ప్రకటించింది స్థానిక ప్రభుత్వం. ఇందుకు కారణం ఆ చిన్న పట్టణంలో ఎవరూ ఉండటం లేదు. పెద్ద నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పట్టణం ఖాళీ అయిపోతోంది. ఏకంగా గడచిన 100 ఏళ్లలో ఆ పట్టణంలో జనాభా తగ్గుతోందే కానీ.. పెరగడం లేదు. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.12కే ఇంటిని ఇవ్వడమే కాదు.. మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. ఇంటి మరమ్మతులకు 3లక్షలు ఆర్ధిక సాయం ఇస్తామంటోంది. కారణం కాస్త పాత ఇళ్లు కావడమే. అయితే.. అక్కడ ఇల్లు కొనాలంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్తోంది.

అక్కడ ఇల్లు కొనుక్కునేవారు 15 ఏళ్లపాటు లెగ్రాడ్ పట్టణంలోనే అదే ఇంట్లో ఉంటామని డిక్లేరేషన్ ఇవ్వాలి. ఇంట్లో ఉండేవారు 40ఏళ్ల వయసులోపు వారై ఉండాలి. వీటికి ఓకే అంటేనే.. అక్కడ ఇల్లు కొనే అవకాశం ఇస్తోంది. ఈ రూల్స్ కఠినంగా ఉన్నా అక్కడ ఉన్న 19 ఇళ్లకు 17 ఇళ్లు అమ్మగలిగింది. ప్రస్తుతం లెగ్రాడ్ లో 2250 మంది మాత్రమే ఉన్నారు. 70 ఏళ్ల క్రితం అక్కడి జనాభా అది. హంగేరి సరిహద్దుకి దగ్గరలో ఉంది. పట్టణం చుట్టూ పచ్చని పొలాలు, అటవీ ప్రాంతం ఉన్నాయి. ఒకప్పుడు లెగ్రాడ్ క్రొయేషియాలో రెండో పెద్ద పట్టణం. అయితే.. శతాబ్దం క్రితం ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడంతో ఈ పట్టణ అభివృద్ధి ఆగిపోయింది.