Camphor: భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా.. అయితే కర్పూరంతో ఇలా చేయండి..!

ఇంటి వాతావరణం మన జీవితానికి ప్రతిబింబం లాంటిది. మన చుట్టూ ఉన్న శక్తులు మన ఆలోచనలపై, మన ఆరోగ్యంపై, మన అదృష్టంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శక్తుల సమతుల్యత చాలా ముఖ్యమని చెబుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో సహజమైన కానీ శక్తివంతమైన పదార్థం ఒకటి ఉంది అదే కర్పూరం.

ప్రతి ఇంటిలోనూ పూజల సమయంలో కర్పూరం వాడటం సాంప్రదాయం. కానీ దాని వెనుక ఉన్న వాస్తు శాస్త్ర రహస్యాలు చాలా మందికి తెలియవు. కర్పూరం కేవలం పూజాసామగ్రి మాత్రమే కాదు.. ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తూ ఇంట్లో సానుకూలతను వ్యాప్తి చేసే శక్తివంతమైన సాధనం అని నమ్ముతారు. వాస్తు నిపుణుల ప్రకారం, ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయా.. పనుల్లో ఆటంకాలు వస్తున్నాయా..? అలాంటి సమయంలో ప్రతి రోజు సాయంత్రం పూజ సమయంలో కర్పూరంలో ఒకటి లేదా రెండు లవంగాలు వేసి కాల్చండి. ఈ సులభమైన పరిహారం ద్వారా ఆర్థిక అడ్డంకులు తొలగి, అదృష్టం మీ వైపుకు తిరిగి వస్తుందని నమ్మకం ఉంది.

ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి కూడా కర్పూరం అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఇంటిలోని ప్రతి మూలలో ఒక చిన్న కర్పూరం ముక్క ఉంచి అది కరిగిన తర్వాత కొత్తది ఉంచడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఇది వాతావరణంలో ప్రశాంతతను, సౌఖ్యాన్ని తెస్తుంది. ఇక వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద, పూజగదిలో, డబ్బు సేఫ్ దగ్గర కర్పూరం ఉంచడం అత్యంత శుభప్రదమని చెబుతారు. ఇది ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి, సంపద ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

ఇక గృహ శాంతి విషయానికి వస్తే.. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయా..? కుటుంబంలో కలహాలు ఆగడం లేదా..? అప్పుడు బెడ్‌రూమ్‌లో చిన్న కర్పూరం ముక్కను ఉంచండి. ఇది ఆ ప్రదేశంలోని నెగటివ్ వైబ్స్‌ను తగ్గించి ప్రేమ, అవగాహన పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. నిద్రకు ముందు దిండు కింద కర్పూరం ఉంచితే మానసిక ఒత్తిడి తగ్గి, లోతైన నిద్ర లభిస్తుంది.

ఒక ఆసక్తికరమైన వాస్తు టిప్.. ఒక చిన్న గిన్నెలో నీటితో పాటు కొన్ని కర్పూరపు ముక్కలు వేసి గదిలో ఉంచితే, ఆ గదిలో శాంతి, సానుకూలత పెరుగుతాయి. మరో మార్గం ఒక స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్, కర్పూరం, నీరు కలిపి ఇంట్లో స్ప్రే చేయండి. వెంటనే గాలి తాజాదనంతో నిండిపోతుంది. కర్పూరం వాసన కేవలం సుగంధం మాత్రమే కాదు.. అది గాలిలో వ్యాపించే ఆధ్యాత్మిక శక్తి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించి, ఇంట్లో సుఖశాంతిని పెంచుతుంది. వాస్తు నిపుణులు చెబుతున్నట్లు, కర్పూరం సరిగ్గా ఉపయోగిస్తే అది ఇంటి ఆరాను శుభ్రపరచి, సానుకూల శక్తిని పెంచి, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుంది.

మొత్తానికి, కర్పూరం ఒక చిన్న పదార్థం అయినా, దాని శక్తి అపారమని వాస్తు శాస్త్రం చెబుతోంది. కేవలం ఒక చిట్కా.. ప్రతి రోజు సాయంత్రం కర్పూరం కాల్చడం.. మీ ఇంటిని సానుకూల శక్తులతో నింపుతుంది.