Brain Tumor: రాత్రిపూట ఇలా జరుగుతోందా.. ఇది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు..!

ఆధునిక జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు… ఇవే ఎన్నో ప్రమాదకర వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సులోనే తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో బ్రెయిన్ ట్యూమర్ అన్నది అత్యంత ప్రాణాంతకమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. మన దేశంలో కూడా ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, ఒక క్లస్టర్‌లా ఏర్పడినప్పుడు ఏర్పడుతుంది. కొన్ని ట్యూమర్లు మృదువుగా ఉండి పెద్దగా హానిచేయకపోయినా, మరికొన్ని వేగంగా విస్తరించి ప్రాణాంతకంగా మారతాయి. ప్రత్యేకించి రాత్రిపూట వచ్చే కొన్ని లక్షణాల రూపంలో ఈ ట్యూమర్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. వాటిని ముందే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఉదయం లేచిన వెంటనే తీవ్రమైన తలనొప్పి రావడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నొప్పి మరింతగా పెరగడం అన్నీ సాధారణం కాదు. ఇది బ్రెయిన్ లో ట్యూమర్ కారణంగా ఏర్పడిన ఒత్తిడి లక్షణంగా చెప్పవచ్చు. అలాగే నిద్రలేమి కూడా మరో ముఖ్యమైన సూచన. బ్రెయిన్ ట్యూమర్ మెదడులో నిద్రను నియంత్రించే ప్రాంతాలపై ప్రభావం చూపడంతో, నిద్ర భంగం, పగటిపూట నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇంకొన్ని సందర్భాల్లో, ఉదయాన్నే లేచిన వెంటనే వాంతులు అవ్వడం, అలా తరచూ జరగడం కూడా ఆందోళనకరం. మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల ఈ లక్షణం స్పష్టంగా కనిపించవచ్చు. అలాగే, రాత్రిపూట అకస్మాత్తుగా చెమట పట్టడం, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు రావడం కూడా ట్యూమర్ ప్రభావమే కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరొక అత్యవసర సంకేతం మూర్ఛలు. నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఆకస్మికంగా కుదిపించుకోవడం, ఫిట్స్ రావడం వంటి సంఘటనలు ట్యూమర్ లక్షణాలు కావచ్చని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయోజనుల్లో ఇలాంటి లక్షణాలు సడెన్‌గా ప్రారంభమైతే, దీని వెనుక మెదడులో జరిగే మార్పులే ఉండే అవకాశముందని అంటున్నారు.

ఈ రకమైన ఆరోగ్య సూచనలను ఎప్పటికైనా సరే చిన్నగా తీసుకోవద్దు. శరీరం ఇవ్వే సంకేతాలను గమనించి, నిపుణుల సలహాతో సమయానికి టెస్టులు చేయించుకుంటే, ప్రాణాంతక పరిస్థితులు తప్పించుకోవచ్చు. అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటం ఈ సమయంలో అత్యవసరం.