మనం పడుకునే ముందు ఫోన్‌ను పక్కన పెట్టి డేటా ఆఫ్ చేయకపోవడం ఒక చిన్న అలవాటు అనిపించినా.. దానివల్ల కలిగే నష్టాలు పెద్దవిగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది డేటా లేదా వైఫై ఆన్‌లో ఉంచి నిద్రపోతారు. కానీ ఇది మీకు ముప్పు తెచ్చే అంశం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి, ఫోన్ పనితీరుకు కూడా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫోన్‌లో డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటే, బ్యాక్ గ్రౌండ్‌లో యాప్‌లు నిరంతరంగా పనిచేస్తూ మీ సమాచారం సేకరిస్తాయి. కొన్ని యాప్‌లు మైక్రోఫోన్, కెమెరాను కూడా మీకు తెలియకుండానే యాక్టివేట్ చేసే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే ఒక ప్రముఖ టెక్ ఇంజనీర్ బయటపెట్టిన విషయాన్ని గూగుల్ కూడా అంగీకరించింది. అంటే డేటా ఆన్‌లో ఉంచితే మీ ప్రైవసీకి నేరుగా ముప్పు ఏర్పడుతుంది. ఇక భద్రత విషయానికి వస్తే.. హ్యాకర్లు, మాల్వేర్, వైరస్‌లు ఎప్పుడైనా మీ ఫోన్‌లోకి చొరబడే అవకాశం ఉంది. ఫోన్ నిరంతరం డేటాను పంపుతూ, స్వీకరిస్తూ ఉండడం వల్ల మీ స్థానాన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. అనగా మీ కదలికలు, ఆన్‌లైన్ కార్యకలాపాలు కూడా బహిర్గతం అయ్యే ప్రమాదం ఉంది.
అదొక్కటే కాదు, రాత్రిపూట డేటా ఆఫ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం, జీవనశైలికి అనేక లాభాలు ఉంటాయి. నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల నిద్ర ప్రశాంతంగా పడుతుంది. నిద్ర సరిగ్గా పడకపోతే కలిగే ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ అప్‌డేట్లు జరగకపోవడం వల్ల మీ డేటా వినియోగం అదుపులో ఉంటుంది. టెక్నాలజీ నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిద్ర సమయంలో ఫోన్‌లోని రేడియేషన్ నిరంతరం శరీరానికి తగలకుండా ఉండటానికి డేటా ఆఫ్ చేయడం సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే చిన్న, కానీ ప్రభావవంతమైన అలవాటు అవుతుంది.
అందువల్ల, ఒక చిన్న పని పడుకునే ముందు డేటా లేదా వైఫైని ఆఫ్ చేయడం.. మీ గోప్యత, భద్రత, ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా, మీ మానసిక ప్రశాంతతకు కూడా దోహదం చేస్తుంది. ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది.
