ఈ మధ్య కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహం దీర్ఘ కాలం పాటు మనుషులను వేధించే ఆరోగ్య సమస్యలలో ఒకటనే సంగతి తెలిసిందే. మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్లను తిన్న సమయంలో ఇన్సులిన్ సహకారం తగ్గిపోవడం వల్ల షుగర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. షుగర్ వల్ల ప్రతి సంవత్సరం ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు.
ఈ వ్యాధి లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండటం ద్వారా వ్యాధి బారిన పడకుండా రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. మహిళలు ఎప్పటిలా మామూలుగా తింటున్నా సరే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం ప్రారంభిస్తే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఎక్కువగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం డయాబెటీస్ వ్యాధికి ప్రారంభ సంకేతాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఎప్పుడూ ఆకలి ఉన్నట్లే అనిపిస్తున్నా మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. శరీరం మరింత ఆహారం కావాలని పదేపదే కోరుకుంటుంటే మాత్రం అప్రమత్తం అయితే మంచిది. ఈ వ్యాధి ఉన్నవారికి కొందరిలో చూపు మందగించడంతో పాటు చేతులు, కాళ్లు తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లకు గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.
మధుమేహం సమస్య బారిన ఒకసారి పడితే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా షుగర్ బారిన పడ్డారో లేదో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మధుమేహం వల్ల కొన్నిసార్లు గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు.