వాహనదారులకు అలర్ట్…. ట్రాఫిక్ రూల్స్ లో మార్పులు.. గీత దాటారో అంతే సంగతులు!

ప్రస్తుత కాలంలో వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని వాహనాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఈ ప్రమాదాలను అరికట్టటానికి పోలీసు అధికారులు ట్రాఫ్రిక్‌ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వాహనదారులకు భారీగా జరిమానాలు వేధిస్తున్నారు. అలాగే పట్టణాలలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కూడా జరిమానాలు విధిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడులో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వచ్చాయి.

ఈ మేరకు చెన్నై నగరవ్యాప్తంగా పోలీసులు గస్తీ పనులు చేపట్టి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీగా కేసులు నమోదుచేసి, భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నారు. సాధారణంగా పట్టణాలలో కూడళ్ల వద్ద ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా లేక మితిమీరిన వేగంతో వాహనం నడిపిన, అలాగే ద్విచక్ర వాహనం మీద ముగ్గురు నలుగురు ప్రయాణించిన కూడా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినట్లు అవుతుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా చెల్లించక తప్పదు.

అలాగే సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రెడ్‌ లైట్‌ పడితే వాహనదారులు తమ వాహనాలను ‘స్టాప్‌ లైన్‌’కు ముందు నిలపాలి. కానీ ఒక్కోసారి గీత దాటిన తర్వాత రెడ్‌లైట్‌ పడితే అక్కడే వేచిఉండవల్సి వచ్చేది. అయితే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా కొంతమంది వాహనదారులు గీత దాటి ముందుకు వస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఇతర మార్గాల్లో వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్‌ పడినప్పుడు స్టాప్‌లైన్‌ను దాటి ముందుకెళ్లిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్క సోమవారం నాడే చెన్నైలోని 150 ప్రధాన సిగ్నళ్ల వద్ద 3,702 కేసుల నమోదయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా స్టాప్‌ లైన్‌ దాటిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.