కన్నడ హీరో రక్షిత్ – రష్మిక మందన లవ్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా లవ్, అటుపై నిశ్చితార్థం, బ్రేకప్ ఇవన్నీ చూస్తుండగానే చకచకా సాగిపోయాయి. రక్షిత్ – రష్మిక మధ్య మనస్ఫర్థలు తప్పలేదు. రక్షిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికలపై రష్మికపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బూతు పదజాలంతో విరుచుకుపడ్డారు. టాలీవుడ్ కెరీర్ కోసం ప్రేమికుడినే వదులుకుందని తిట్టేయడం చర్చకొచ్చింది. అయితే రష్మిక కెరీర్ కోసం అన్నిటినీ వదులుకుంది.
అయితే ప్రేమ వైఫల్యం రక్షిత్ ముందు అతి పెద్ద సవాల్ నే ఉంచింది. తనని కాదనుకున్న ప్రేయసి ముందు అతడు నిరూపించుకోవాల్సిన సన్నివేశం లో అతడు పాన్ ఇండియా హీరోగా ఓ ట్రయల్ వేశాడు. `అతడే శ్రీమన్నారాయణ` అంటూ ఇటు టాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. ఈ సినిమా అటు కన్నడ సహా ఇతర భాషల్లోనూ రిలీజైంది. ఇంతకుముందు ట్రైలర్ తో రక్షిత్ మెప్పించాడు. అతడిలోని ఎనర్జీ స్టైల్ అందరినీ ఆకట్టుకున్నాయి. సైలెంటుగా కేజీఎఫ్ తరహాలో ఏదైనా హిట్టు కొడతాడా? అంటూ ట్రైలర్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కానీ ఆ బజ్ ని నిలబెట్టుకోవడంలోనే రక్షిత్ టీమ్ ఫెయిలైంది.