పోలార్ వొర్టెక్స్ ఎఫెక్ట్‌: చికాగో..అంటార్కిటికాను మించిన చ‌లి!

అంటార్కిటికాలో చ‌లి తీవ్ర‌త అధికంగా ఉంటుంద‌ని మ‌నం చ‌దువుకున్నాం క‌దా! అమెరికాలోని చికాగోలో దాన్ని మించిన చ‌లి వ‌ణికించ‌బోతోంది. పోలార్ వ‌ర్టెక్స్ ప్ర‌భావం వ‌ల్ల అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో గ‌జ‌గ‌జ‌లాడుతున్నాయి. జ‌నం బ‌య‌ట‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. చికాగోలో చ‌లి తీవ్ర‌త అసాధార‌ణంగా ఉంటోంది.

వ‌చ్చే వారంరోజుల్లో చ‌లి తీవ్ర‌త రికార్డుస్థాయికి చేరుకుంటుంద‌ని అమెరికా వాతావ‌ర‌ణ సంస్థ `నేష‌న‌ల్ వెద‌ర్ సర్వీస్ (ఎన్‌డ‌బ్ల్యూఎస్‌)` వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం చికాగోలో -16 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంద‌ని, వారం రోజుల్లో ఈ సంఖ్య -27 ఫారెన్ హీట్‌కి చేరుకోవ‌చ్చ‌ని అంచ‌నా.

మ‌రో అయిదేళ్ల వ‌ర‌కూ ఇంత‌టి చ‌లిని చూడ‌లేక‌పోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో సుమారు రెండున్న‌ర కోట్ల మంది చ‌లి గుప్పిట్లో చిక్కుకున్నార‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిన్నెపోలిస్‌, చికాగోలాండ్‌లో -50 చొప్పున‌, మిన్నెసోటాలో -60, లేక్ మిచిగాన్‌లో -80, ద‌క్షిణ మిచిగాన్‌లో -94 డిగ్రీల ఫారెన్ హీట్‌లో ఉష్ణోగ్రత న‌మోదవుతుంద‌ని ఎన్‌డ‌బ్ల్యూఎస్ అంచ‌నా వేస్తోంది.

చ‌లి తీవ్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని అట్లాంటా స‌హా మెట్రో ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు, విద్యాసంస్థ‌ల‌కు సెల‌వును ప్ర‌క‌టించారు. అప్ప‌ర్ మిడ్‌వెస్ట్‌, గ్రేట్స్ లేక్స్ ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొని ఉంది. చికాగో కేంద్రంగా మంచు తుఫాన్ విరుచుకు ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఇల్లినాయిస్ గ‌వ‌ర్న‌ర్ జేబీ ప్రిట్జేకెర్ హెచ్చ‌రించారు.

శుక్ర‌వారం వ‌రకూ చికాగో అంత‌టా వాతావ‌ర‌ణం -0 స్థాయిలోనే ఉంటుంద‌ని చెప్పారు. చికాగోలోనూ పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని `ఎమ‌ర్జెన్సీ క్లోజింగ్ సెంట‌ర్` (http://www.emergencyclosingcenter.com/complete.html) త‌న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.