అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ట్రంప్ వద్ద పర్సనల్ లాయర్ గా పనిచేసే మైఖేల్ కోహెన్ ను మన్ హట్టన్ లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ తో సంబంధాలపై నోరెత్తకుండా ఉండేందుకు శృంగార తార స్టార్మీ డేనియెల్స్ కు భారీగా చెల్లింపులు చేసినట్టు ట్రంప్ మాజీ లాయర్ మైకేల్ కోహెన్ కోర్టులో అంగీకరించారు. 8 చార్జీ షీట్లలో దోషిగా తేలిన కోహెన్ పై పన్ను ఎగవేత అభియోగాలు కూడా రుజువయ్యాయి.
కోర్టు విచారణలో ట్రంప్ కు సంబంధించి కోహెన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కోహెన్ దోషిగా తేలినందున ఈ వ్యవహారంలో ట్రంప్ కు కూడా చిక్కులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. కోహెన్ ఒకరికి లక్షా ముప్పై వేలు, మరొకరికి లక్షా యాభై వేల డాలర్లు చెల్లించినట్టు తేలిందని తెలిపారు. మరోవైపు ఇద్దరు మహిళలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను ట్రంప్ తోసి పుచ్చారు.
ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ తరపు న్యాయవాది రూడీ గిలియానీ అన్నారు. ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టి ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి యత్నిస్తున్నారని మండి పడ్డారు. కోహెన్ ట్రంప్ పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కోహెన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రహించి అతన్ని ట్రంప్ ఎప్పుడో దూరం పెట్టాడని అన్నారు.