ర‌ష్యా మాజీ బ్యూటీ క్వీన్‌ను పెళ్లాడాడ‌ట‌: పాపం! ఆ దేశ రాజు ప‌ద‌వి ఊడింది

ర‌ష్యా మాజీ సుంద‌రిని పెళ్లాడిన‌ట్లు గుప్పు మ‌న్న వ‌దంతులు.. ఆ దేశ రాజు ప‌ద‌వినే ఊడ‌గొట్టింది. ఆయ‌న పేరు సుల్తాన్ ముహ‌మ్మ‌ద్ -5. మ‌లేసియాకు 15వ రాజు ఆయ‌న‌. 49 ఏళ్ల వ‌య‌స్సులో ర‌ష్యాకు చెందిన మాజీ బ్యూటీ క్వీన్‌, `మిస్ మాస్కో` టైటిల్ విజేతను పెళ్లి చేసుకున్నారనే వార్త‌లు ఒక్క‌సారిగా వ్యాపించాయి.

ఆ మిస్ మాస్కో పేరు ఒక్సానా వొయోడినా. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. 2015లో ఆమె మిస్ మాస్కో టైటిల్‌ను గెలిచారు. సుల్తాన్ ముహ‌మ్మ‌ద్ ఆమెను పెళ్లి చేసుకున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనికి స‌రైన స‌మాధానం చెప్ప‌లేక ఆయ‌న ఏకంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని మ‌లేసియా రాయ‌ల్ ఫ్యామిలీ ధృవీక‌రించింది.

ఈ మేర‌కు కౌలాలంపూర్‌లో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. సుల్తాన్ ముహ‌మ్మ‌ద్ ఎందుకు రాజీనామా చేశార‌నే విష‌యాన్ని మాత్రం ఇందులో పేర్కొన‌లేదు. 1957లో బ్రిట‌న్ నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన త‌రువాత మ‌లేసియా రాజు ఒక‌రు ఇలా అర్ధంత‌రంగా ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇదే తొలిసారి. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రాజీనామా చేశార‌నే వార్త కూడా వినిపిస్తోంది.