ప్రపంచాన్ని కుదిపేసిన చిన్నారి శోకం ఇది. ఈ పిల్ల పేరు యానెలా శాన్చెస్. మెక్సికో అమెరికా సరిహద్దు దగ్గిర తన తల్లి పట్ల కర్కశంగా వ్యవరిస్తున్న అమెరికా పోలీసులను చూసి భయపడి ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది.
రాజకీయాశ్రయం కోసం ఈ పిల్ల తల్లి శాండ్రా శాన్చెస్ హోండురాస్ నుంచి నెల రోజులు అష్టకష్టాలు పడి మెక్సికో ద్వారా అమెరికా సరిహద్దు రేఖ దాటలనుకుంది. ఆ ఒక్క పనిచేస్తే అమెరికా స్వర్గంలో పడిపోవచ్చనుకుంది.
అయితే, ఆమె సరిహద్ద రేఖ మీద గద్దల్లా కన్నేసిన అమెరికా అధికారులో చేతిలో పడింది. ఆమెను, కూతురితో సహా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా ఆధ్యక్షుడు ట్రంపు దేశంలోకి చొరబడే వారి పట్ల దయాదాక్షిణ్యాలు అవసరంలేదు అని జీరో టాలరెంట్ విధానం ప్రకటించారు. దీనితో మెక్సికో బార్డర్ దాటుకుని వచ్చే వాళ్లందరిని అరెస్టు చేస్తున్నారు. వారిని పిల్లలనుంచి వేరు చేసి కేసులు పెట్టి జైలు కు పంపిస్తున్నారు.
తల్లికి దూరం కాబోతూ ఈ చిన్న పిల్ల విలపించడం ప్రపంచంలోని మానవతా వాదులందరి గుండెల్లో బాణంలో గుచ్చుకుంది.
సోషల్ మీడియాలో ఒకటే గల. సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్రంపు ను వెంటబడి రక్కేశారు. ఈ గగ్గోలుకు స్పందిస్తూ తాము అరెస్టు చేసిన వారితో శాండ్రా గాని, ఆమెకూతురు గాని లేరని అమెరికా కస్టమ్స్ సరిహద్దు భద్రత అధికారులు బుకాయించారు.
ప్రపంచం నలుమూల నుంచి వస్తున్నతిట్లు, శాపనార్థాలు భరించలేక, ట్రంపు ఈ విధానాన్ని మార్చుకోవలసి వచ్చింది.
బాగా ముదిరిన అహంకారి అయిన ట్రంప్ తను చేసిన శాసనాన్ని వెనక్కు తీసుకోవడం అంటే మాటలు కాదు.అయినా సరే ఆయన వెనకంజ వేశారు. దీనికి కారణం ఈ ఫోటోయే.
ఈ పోటోని 2018 జూన్ 12 న తీశారు. ఫోటోగ్రాఫర్ పేరు జాన్ మూర్. ఆయన గెటీ ఇమేజెస్ కు సీనియర్ ఫోటోగ్రాఫర్, స్పెషల్ కరెస్సాండెంట్.
మూర్ కాకలు తీరిన ఫోటోగ్రాఫర్. ఆరు ఖండాలలోని 65దేశాలలో ఆయన ఫోటోగ్రాఫర్ గా పని చేశారు. 17 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఫోటో గ్రాఫర్ గా నికరాగ్వా, ఇండియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, ఈజిప్టు, పాకిస్తాన్ లలో పని చేశారు. 2008లో అంతర్జాతీయ బాధ్యతలనుంచి ఆయన అమెరికా చేరుకున్నారు. అప్పటి నుంచి ఇమిగ్రేషన్, సరిహద్దు సమస్యల మీద దృష్టి పెట్టారు.దాని ఫలితమే ఈ ఫోటో.
ఈ ఫోటోని ప్రపంచమంతా ప్రచురించి అమెరికా ట్రంపు పాలన మీద ఏహ్యం కలిగేలా చేశారు. ట్రంపు విధానాలలో ఉన్న అమానుషత్వాన్ని, మానసిక హింసను, కనిపించని క్రూరత్వాన్ని ఈ ఫోటో వెల్లడించిందని ప్రశంసించారు.
అందుకే ఈ ఫోటో వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు కు ఎంపికయింది.
అమెరికా- మెక్సికో సరిహద్దు దగ్గిర సోదా చేసేందుకు తల్లి నుంచి పిల్లను వేరు చేసినపుడు, పిల్ల కళ్లలో, ముఖంలో భయం,ఆందోళన తారట్లాడటం నాకు కనిపించింది, దాన్నే ప్రపంచానికి చూపించాననని మూర్ ఫోటో గురించి చెప్పారు.