మూడు రోజుల కిందట ఈ పేమస్ ‘ముద్దు’ కథ ముగిసింది

20 వ శతాబ్దపు మేటి ముద్దుగా ఈ ముద్దుకు పేరుంది. ఈ పోటో కూడా 20వ శతాబ్దపు మేటి ఫోటో అని చెబుతారు.

మూడు రోజుల కిందట ఆదివారం నాడు ఈ ముద్దు (The Kiss) చరిత్ర ముగిసింది. పరవశంగా నర్స్ డ్రెస్ లో ఉన్న అమ్మాయిని ముద్దుపెట్టుకున్న జార్జ్ మెండోన్సా చనిపోయాడు. ఆయన వయసు 95 సంవత్సరాలు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినట్లు 1945 ఆగస్టు 14న ప్రకటించారు. ఈ వార్తతో అమెరికా మైమరచి చిందులేసింది. ఎందుకంటే, యుద్ధం ముగిసిందనే వార్త కంటే, జపాన్ సరెండర్ అయిందన్న వార్తతో అమెరికా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఆ వార్త వినగానే వి న్యూయార్క్ ప్రజలంతా పోలోమని రోడ్ల మీద కొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో మెండోన్సానేవీలో సెయిలర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకూడా అపుడు న్యూయార్క్ లో ఉన్నాడు. అందరితో పాటు కేకేలేస్తూ కేరింతలు కొడుతూ టైమ్స్ స్క్వేర్ లోకి వచ్చాడు. ఆయనకు ఎదురుగా నర్స్ యూనిఫాం లో ఉన్న డెంటల్ అసిస్టెంట్ గ్రెటా జిమ్మర్ ఫ్రీడ్మన్ కనిపించింది. అంతే, అమాంతం వాటేసుకుని ముద్దాడాడు.

వాళ్లెవరికి ఒకరికొకరు పరిచయం లేదు.

మెండెన్సాయుద్దం ముగిసిందన్న ఆనంద పారవశ్యంలో ఆమెను చుంబించాడు. టైమ్స్ స్క్వేర్ లో కనిపించిన ఈ హఠాత్పరిమాణాన్ని అక్కడే ఉన్న చాలా మంది ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.

అయితే,ఆల్ఫ్రడ్ ఐసెన్ స్టేడ్ తీసినఫోటో యే విశ్వవిఖ్యాతి చెందింది. ఈ ఫోటోను లైఫ్ మ్యాగజూన్ V-J Day in Times Square పేరుతో ప్రచురించింది. అంతే, ‘ The Kiss” గా పేరొందిన ఈ ఫోటో 20 వ శతాబ్దపు బెస్ట్ ఫోటో అని కూడా పేరు తెచ్చుకుంది.

తమాషా ఏమంటే, ఈ ఫోటోలో ఉన్నది తామే నని చాలా మంది చెప్పుకున్నా, చివరకు తెలిందేమిటంటే అందులో ఉన్నది జార్జ్ మెండోన్సా, అల్ ఫ్రెడ్ జిమ్మర్ ఫ్రీడ మన్ అని.

ఈ ముద్దు తర్వాత వారిద్దరు సెలెబ్రిటీలయ్యారు. ఎక్కడ పోయినా ఈ ముద్దు గురించి అడుగుతున్నారు. మాట్లాడమంటున్నారు. లెక్కలేనన్ని సార్లు ముద్దు గురించి ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు.

మెండోన్సా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నౌకలను విచ్ఛిన్నం చేసే నౌక మీద పని చేశారు. యుద్ధం ముగిసిందని ప్రకటించే రోజున ఆయన శెలవు మీద న్యూయర్క్ వచ్చారు.

2015 రోడ్ ఐలండ్ స్టేట్ హౌస్ లో ఆయనను సన్మానించింనపుడు మెండోన్సా ఈ ‘ముద్దు’ ముచ్చట అందరితో పంచుకున్నారు. ఆ రోజు టైమ్స్ స్క్వేర్ లో ఫ్రీడ్ మన్ ను చూడగానే తనకు తన ఆసుపత్రి నౌకలో గాయపడిన నావికులకు చికిత్స చేస్తున్న ఒక నర్స్ గుర్తుకు వచ్చిందని ఆయన చెప్పారు.

‘అపుడు నర్సులేంచేశారో రోజూ చూశాను. ఇపుడు టైమ్స్ స్క్వేర్ లో ఉన్నాను. యుద్ధం ముగిసింది. కొద్దిగా మందేసుకున్నాను.ఆమె ఎదురొచ్చింది. వాటేసుకున్నాను,’ అని మెండోన్సా చెప్పినట్లు అమెరికా టివి ఒకటి రిపోర్టు చేసింది.

2005 లో ఫ్రీడ్ మన్ ఒక ఇంటర్వ్యూ లో ఈ ముద్దు గురించి చెబుతూ ఆయన అలా ముద్దు పెట్టుకోవడం తనకిష్టం లేదని చెప్పారు.

‘ అతగాడు దగ్గరకొచ్చాడు, వాటేసుకున్నాడు, ముద్దుపెట్టుకున్నాడు,’ అని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు ఆమె చెప్పారు.
అక్కడ యుద్ధం ముగిసిందన్న ఆనందమే తప్ప శృంగార సన్నివేశాలకు అస్కారమే లేదని ఆమె చెప్పారు.

ఫ్రీడ్ మన్ 92 వ యేట 2016 లో వర్జినీయా, రిచ్ మండ్ ఆసుపత్రిలో వృద్ధాప్యం సంబంధ సమస్యలతో చనిపోయారు.

మొన్న అదివారం నాడు  మెండోన్సా 96వ జన్మదినానికి ముందు చనిపోయారు. కొద్ది రోజుల కిందట ఆయన కిందపడ్డారు. దెబ్బతగలడంతో ఆసుపత్రిలో చేర్చారు. తర్వత చనిపోయారు. దీనితో ఈ సెన్సెషనల్ ముద్దు చరిత్ర ముగిసింది.