ఈ ఫొటోలో..కొందరు వ్యక్తులు డబ్బాల్లో పెట్రోలు తెచ్చి ఉద్దేశపూరకంగా రైలు పట్టాలకు నిప్పంటిస్తున్నారు కదూ! అలాగని వాళ్లేమీ మావోయిస్టులో, ఉగ్రవాదులో కాదు. బాధ్యత గల రైల్వే ఉద్యోగులు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం చేపట్టిన ఆందోళనల్లో భాగంగా రైలు పట్టాలకు నిప్పంటిస్తున్నారని అనుకోవడానికీ ఛాన్స్ లేదు.
ఎందుకంటే- ముందే చెప్పుకొన్నట్లు వాళ్లంతా బాధ్యత గల రైల్వే ఉద్యోగులు. ఇలా బాధ్యతా రాహిత్యంగా దగ్గరుండి మరీ పట్టాలకు నిప్పు పెట్టడం వెనుక ఓ చిన్నపాటి కథ ఉంది. ఈ ఘటన చోటు చేసుకున్నది అమెరికాలోని చికాగోలో. తెలుసుగా! పోలార్ వొర్టెక్స్ ప్రభావం వల్ల కొద్దిరోజులుగా చికాగో గజగజలాడిపోతోంది.
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా చలి కాలాన్ని అనుభవిస్తోంది. నీళ్లు పైకి ఎగరేస్తే..మంచు ముక్కలుగా కిందపడేంతటి చలి ఉంది అక్కడ. కార్లూ, రోడ్లు.. ఇలా ఏవి పడితే అవి మంచు దిమ్మెల్లా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పట్టాలు ఎలా ఉంటాయి? మంచు పేరుకు పోయి, కాలు పెడితే జర్రున జారిపోయేలా తయారయ్యాయవి.
అలాంటప్పుడు రైళ్లు ఎలా వెళ్లగలుగుతాయి? దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఉద్యోగులు పట్టాలకు పెట్రోలు పోసి మరీ నిప్పు అంటిస్తున్నారు. ఆ వేడికి మంచు కరిగి మామూలు స్థితికి వస్తాయనేది వారి ఉద్దేశం. మంటల వల్ల పట్టాలు వేడెక్కి, మంచు కరిగిపోయి, అవి మామూలు స్థితికి వస్తున్నాయి.