ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలకు ఒడిగడుతున్న పలువురి ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధ్యాత్మిక బోధలు చేసి తమకి జ్ఞానోదయం కలిగిస్తారని గురువులను నమ్ముతున్న ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు దొంగ బాబాలు. లైంగిక దోపిడీలు, ఆర్ధిక దోపిడీలు చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పగలు సన్యాసులుగా, మత గురువులుగా, బాబాలుగా ప్రబోధలు చేస్తూ, కఠిన నిష్టలు పాటిస్తున్నట్టు ఆస్కార్ నటనలు చేస్తారు. రాత్రి అయితే చాలు విలాసవంతమైన పడక గదుల్లో సాధ్విలతో సేవలు చేయించుకుంటూ శృంగార లీలలు చేస్తూ చీకటి రాజ్యమేలుతున్నారు.
గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవారు కూడా ఇలాంటి బాబాల నిజస్వరూపం తెలియక వారికి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. ఇవి చాలక అక్రమాలకు పాల్పడుతున్నారు బాబాలు. ప్రజలలో వారిపై ఉన్న విశ్వాసాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఈ దొంగ స్వామీజీలు. మనదేశంలో ఇలాంటి బాబాలకు కరువే లేదు. నిత్యానంద, ఫలహారి బాబా, డేరా బాబా, రాధేమా…ఇలా చెప్పుకుంటే పోతే ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఇలాంటి క్రిమినల్స్ చాలామంది ఉన్నారు. థాయిలాండ్ లో ఇలాంటి ఉదంతమే పెనుదుమారం రేపింది. బౌద్ధ సన్యాసి విరాపాల్ సుఖోల్ పాల్పడిన అక్రమాలు అనేకం. ఇప్పుడు ఆ విరాపాల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
థాయ్ బౌద్ధ సన్యాసికి 114 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం. దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న విరాపాల్ సుఖోల్ కి ఈ శిక్ష ఖరారు చేసింది. అత్యాచారం, నగదు బదిలీలు, కంప్యూటర్ క్రైమ్స్ వంటి పలు కేసుల్లో నిందితుడైన విరాపాల్ కేసుపై విచారణ జరిపి, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు అతడిని నేరస్థుడిగా తేల్చింది.
2013 లో అతని ప్రైవేట్ జెట్ లో విరాపాల్ డబ్బు కట్టలతో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో దేశమంతటా దుమారం చెలరేగింది. లైంగిక సంబంధాలు కలిగి ఉండటం బౌద్ధ సన్యాసానికి విరుద్ధం అటువంటిది అతను మైనర్ బాలికలపై అత్యాచారానికి కూడా ఒడిగట్టాడని పలు ఆరోపణలు వచ్చాయి. డేరాబాబాలానే భక్తి ముసుగులో దోపిడీలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఈ విషయాలు బయటకు రావడంతో దేశం వదిలి పరారీలో ఉన్నాడు. చివరికి 2017 లో పోలీసులు అతన్ని యునైటెడ్ స్టేట్స్ లో పట్టుకుని థాయిలాండ్ కి తీసుకొచ్చారు.
కోర్టులో అతడు చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అతను పాల్పడిన ఒక్కో నేరానికి పడిన శిక్షలన్నీ కలిపితే 114 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించాలి. ఓవర్ ఆల్ గా అతను 20 ఏళ్ళు జైల్లో గడపాలి. బాలికలపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో ఇంకా తీర్పు ఇవ్వలేదు కోర్టు. అక్టోబర్ లో ఈ తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటికి ఇతర శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అధికారులు మీడియాతో తెలిపారు.