Balendra Shah: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై జెన్ జెడ్ యువత కదం తొక్కడంతో అక్కడి సర్కార్ కుప్పకూలిపోయింది. యువత ఆగ్రహజ్వాలలకు ప్రధానితో సహా మంత్రులు రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారు. దీంతో హిమాలయ దేశం తదుపరి ప్రధాని ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. వీరిలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ర్యాపర్, రాజధాని కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా(బాలెన్ షా) పేరు వినపడుతోంది. అసలు ఎవరీ బాలెన్ షా..? అతడి వైపు యువత ఎందుకు మొగ్గు చూపుతుంది..? రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు ఆయనకు ఏం సంబంధం..?
ర్యాపర్ నుంచి మేయర్‌గా..
బాలెన్ షా గతంలో హిప్ హాప్ ర్యాపర్‌గా ఉండేవారు. తన పాటలతో దేశంలోని రాజకీయ అవినీతిపై విమర్శలు చేసేవారు. ఆయన రూపొందించిన బలిదాన్ అనే పాట యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి యువతలో మంచి ఆదరణ దక్కించుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన బాలెన్ షా.. 2022లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాజధాని కాఠ్మాండు మేయర్‌గా ఎన్నికయ్మయారు. రాజకీయ పార్టీల మద్దతు లేకుండా తనకు ఉన్న ప్రజాదరణతో స్వతంత్రంగా మేయర్‌గా ఆయన విజయం సాధించడం విశేషం.
బాలెన్ శాంతి సందేశానికి మంచి స్పందన
దేశంలో రాజకీయ నేతలందరూ దొంగలే అందినకాడికి దోచుకుతింటున్నారంటూ ఓ పాటలో రాజకీయ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో నిరసనకారులకు ఆయన ఓ శాంతి సందేశం ఇచ్చారు. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేసినందును యువత ఆస్తి, ప్రాణ నష్టం చేయకుండా శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. షా పిలుపునకు యువత నుంచి మంచి స్పందన వచ్చింది. తదుపరి నాయకుడు బాలెన్ షా అంటూ యువత మద్దతు పలుకుతోంది. సాంప్రదాయ రాజకీయ నేతలతో విసిగిపోయిన నేపాలీ యువతకు 34 ఏళ్ల బాలెన్ షా భవిష్యత్ ఆశాకిరణంలా కనపడుతున్నారు. ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా బాలెన్ షా అటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. ‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
బాలెన్ షా నేపథ్యం ఏంటి..?
1990లో కాఠ్మాండులోని గైర్ గావ్‌లో బాలెన్ షా జన్మించారు. తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు, తల్లి ధ్రువదేవి. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టపడేవారు. కాఠ్ముండులోని వైట్ హౌస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. కాలేజీ రోఉజుల్లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 2022లో కాఠ్మాండు మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై అందరినీ ఆశ్చర్యపరిచారు.
‘ఆదిపురుష్’ సినిమాతో ఏంటి సంబంధం..?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా సమయంలో బాలెన్ షా పేరు ప్రముఖంగా వినపడింది. నేపాల్‌లో సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాముడి భార్య అయిన సీతమ్మ నేపాల్‌లో పుడితే సినిమాలో మాత్రం భారత్‌లో పుట్టినట్లు తప్పుగా చూపించారని మండిపడ్డరు. మూవీలో ఆ సీన్ మార్చకపోతే సినిమాను రిలీజ్ కానివ్వమని వార్నింగ్ ఇచ్చారు.



