లెజెండ్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ సంచలనాల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్త వసూళ్లలో నంబర్ 2 స్థానంలో నిలిచిన గ్రేట్ మూవీ ఇది. ఈ సినిమా రికార్డును కొట్టేందుకు అవెంజర్స్ కి దశాబ్ధం పైగానే పట్టింది. అలాంటి గ్రేట్ మూవీ స్ఫూర్తితో విజన్ అవతార్ అంటూ ప్రత్యేకించి ఓ బెంజ్ కార్ ని తయారు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది ఎలక్ట్రిక్ కార్. డైమ్లర్- బెంజ్ అని పిలుస్తున్న ఈ కార్ ని లాస్ వెగాస్‌లో సోమవారం నాడు లాంచ్ చేశారు. ఇది స్పర్శకు స్పందించే కార్. అధునాతన ఆర్గానిక్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఇక దీని వీల్స్ 30 డిగ్రీల కోణంలో అటూ ఇటూ తిరగడం ప్రత్యేకత. దాన్ని ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగ గలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ‘ఈ కారులో నేను కూర్చొని చూశాను. దీనికి నిజంగా ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటోంది’ జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యానించారు. ఈ కారుకు నడిపేందుకు ప్రత్యేకించి స్టీరింగ్ అన్నది ఉండదు. కేవలం కంప్యూటర్ పై సిగ్నల్స్ ని ఆపరేట్ చేయడం ద్వారా నడిపించేయడం సాధ్యం. ఇక దీని వెనక భాగంలో చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్ చేసి ఉంది కాబట్టి .. దానికి శ్వాస ఆడుతున్న శబ్ధం వస్తుందట. ఇలాంటి కారు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం ప్రకటించలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్ వ్యాఖ్యానించారు. అవతార్ కార్ ఇండియా మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో తెలీదు కానీ… దీనికి సెలబ్రిటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు.