స్ట్రాబెర్రీలను చలికాలంలో ఎక్కువగా తినాలని చెబుతారు… ఎందుకో తెలుసా?

చూడగానే తినాలనిపించే స్ట్రాబెర్రీలను తరచు ఆహారంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషక విలువలు లభించడంతోపాటు మన శరీరాన్ని అనేక అలర్జీలు,ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా అంటు వ్యాధుల తీవ్రత అధికంగా ఉండే చలికాలంలో స్ట్రాబెర్రీలను మన రోజువారి ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రాబెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు,యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రమాదకర అలర్జీలు మరియు అంటూ వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

స్ట్రాబెర్రీలలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థం, పోషక విలువలు అధికంగా ఉంటాయి కావున అతి బరువు, ఉబకాయ సమస్యతో బాధపడేవారు నిక్షేపంగా వీటిని తినవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయనివ్వదు కావున సులువుగా సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఫైబర్ అత్యధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి పొట్టలోని చెడు మలినాలను తొలగించి జీర్ణాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్ట్రాబెరీ జ్యూస్ ను సేవిస్తే వీటిలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలు తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

స్ట్రాబెర్రీలలో పొటాషియం, క్యాల్షియం ,మాంగనీస్,
విటమిన్‌ సి, కె, బీ కాంప్లెక్స్ ,ఫోలిక్‌ యాసిడ్ వంటివి సమృద్ధిగా ఉండి, సోడియం కొలెస్ట్రాల్ వంటివి చాలా తక్కువగా ఉంటాయి కావున వీటిని మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హృదయ స్పందనలు సక్రమంగా జరుగుతాయి. స్ట్రాబెర్రీ తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి టైప్-2 డయాబెటిస్ రిస్క్ను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి అలసట నీరసం వంటి సమస్యలను తొలగించడంతోపాటు రోజంతా మనల్ని ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది.