సీజన్లో ఒక్కసారైనా తినాలనిపించే సీమ చింతకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ఈ రోజుల్లో చాలామందికి తెలియకపోవచ్చు గాని ఒకప్పుడు సీమ చింతకాయలు అంటే ఇష్టపడని వారు తెలియని వారు అంటూ ఉండరు. ఈ రోజుల్లో మనం పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్ కు అలవాటు పడి ఇలాంటి సహజ సిద్ధంగా లభించే కాయలను ఎప్పుడో మర్చిపోయాం. పల్లె వాసులకు సుపరిచితమైన సీమ చింతకాయలు తెలుపు గులాబీ రంగు కలయికతో తీపి వగరు రుచుల కలయికతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. సీమ చింత చెట్లు అత్యధిక ముళ్ళు కలిగి పొలం గట్లు చెరువులు అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి సీజన్ లో మాత్రమే కాయలు పక్వానికి వచ్చి తినడానికి సమృద్ధిగా లభిస్తాయి.

సహజ సిద్ధంగా లభించే సీమ చింతకాయలో ఉన్న ఔషధ గుణాలు పోషక విలువలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా బాగా పండిన సీమ చింతకాయలు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, ఫైబర్, కాల్షియం,ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్లు సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సీజన్లో దొరికే ఈ కాయలను మన ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ కాయల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది వీటిని ఆహారంగా తీసుకుంటే ఎర్ర రక్త కణాల వృద్ధి జరిగి రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది. సీమ చింత ఆకులు కొమ్మల్లో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. డయేరియా సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను కొమ్మలను నీటిలో మరిగించి వచ్చిన కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

షుగర్ పేషెంట్లు ఈ కాయలను ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సీమ చింతకాయల్లో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. సీమ చింతకాయల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కావున జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచడంతో పాటు అతి బరువు సమస్యను కూడా దూరం చేస్తుంది. ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా సీజనల్గా లభించే ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదే.