సిట్రస్ జాతి పలాల్లో ఒకటైన నారింజ పండ్లు తినటానికి మంచి రుచిని ఇవ్వడంతో పాటు మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా నారింజ పండ్లలో నీటి శాతం అధికంగా లభ్యం అవ్వడంతో పాటు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పోలిక్ ఆమ్లం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి మూలకాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. కావున నారింజ పండ్లను లేదా నారింజ జ్యూస్ రోజువారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెప్తున్నారు.
ఎన్నో సుగుణాలు ఉన్న నారింజ పండ్లను కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉబ్బసం, ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నారింజ పండ్లను అతిగా తింటే కడుపు మంట, గుండెలో దడ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు మరింత మిమ్మల్ని బాధించవచ్చు. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తింటే విరోచనాలు వాంతులు సమస్య తలెత్తుతుంది. నారింజ పండ్లలో ఉండే ఆమ్లత్వ గుణాలు కొందరిలో దంతాల ఎనామిల్ లో ఉన్న కాల్షియంతో కలిస్తే బ్యాక్టీరియా సంక్రమణకు దారితీస్తుంది.దంతాల కుహరం ఉన్నప్పుడు నారింజ తినకపోవడమే మంచిది. అలాగని నారింజ పండ్లను పూర్తిగా తినడం మానివేయకూడదు. కొద్ది కొద్దిగా తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది.
శీతాకాలంలో సమృద్ధిగా లభించి నారింజ పండ్లను ఆహారంగా తీసుకుంటే చర్మం పొడిబారకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడడమే కాకుండా నారింజ రసంలో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఏర్పడే ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నారింజలో ఉండే సహజ మూలకాలు, ఔషధ గుణాలు శరీర జీవక్రియలను నియంత్రించి శరీరంలోని అన్ని అవయవాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.