దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర పార్టీలో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఆ ప్రజాప్రస్థాన యాత్ర, వైఎస్‌ఆర్ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలు తెలుసుకున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’తెలుగునాట ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలైన శుక్రవారం ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాకు స్పందన తక్కువగా ఉంది. అంతేకాకుండా అమెరికాలోనూ ఈ సినిమాకు బాగా తక్కువ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలో ఎందుకిలా జరుగుతోందని ట్రేడ్ విశ్లేషకులు పరిశీలించి చూస్తే… కొన్ని వర్గాలు, కులం వారు ఉన్న ప్రాంతంలో ఈ సినిమాకు ఆదరణ బాగా తక్కువగా ఉందంటున్నారు. అలాగే తెలుగు దేశం పార్టీ పట్టు ఉన్న ప్రాంతాలు సైతం ఈ సినిమాకు దూరంగా ఉన్నాయంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న సినిమా కావటం, వై ఎస్ ని దేవుడిగా చూపించే సినిమా కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ సినిమాకు దూరంగా ఉన్నారంటున్నారు . దాంతో ఆ ప్రాంతాల్లో, ఆ కుల ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో యాత్ర వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది.