చిరు-కొరటాల శివ చిత్రం కథ బ్యాక్ డ్రాప్, క్యారక్టర్స్

చిరు-కొరటాల శివ చిత్రం కథ బ్యాక్ డ్రాప్, క్యారక్టర్స్

మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ 22 న లాంచ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల కథనాలు వినపడుతున్నాయి.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. గోవిందు, ఆచార్య అనే పాత్రలు పోషిస్తారు. రెండు ఒకదానికొకటి పోలిక లేకుండా సాగుతాయి. గోవిందు పాత్ర 30 సంవత్సరాల వయస్సు గల యువకుడు కాగా, ఆచార్య పాత్ర నడివయస్సు. పోటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనుకునే పాత్ర. ఇక ఆచార్య ని నక్సలైట్స్ వల్ల ప్రభావితుడై వాళ్లతో తిరిగినవాడు. సమాజం..కొన్ని సిద్దాంతాలు అతనితో ఉంటాయి. ఈ రెండు పాత్రలు మధ్య వచ్చే విబేధాలు, కలిసి చేసే పనులు సినిమాకు హైలెట్ అంటున్నారు. సినిమాలో ఎక్కువ భాగం పలాస, శ్రీకాకుళంలో జరగనుంది.

ఇక చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఎడిటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్‌ ప్రయత్నిస్తోంది.