టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మహర్షి’. మహేష్ బాబు 25 సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కాబోతోంది. ‘మహర్షి’ పై భారీగా అంచనాలు ఉన్నాయి. దాంతో దిల్ రాజు దగ్గరుండి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కలిసి ఫైనల్ డ్రాఫ్ట్ లాక్ చేయటంలో బిజీగా ఉన్నారు. ఏ ఎపిసోడ్స్ అయితే ల్యాగ్ అనిపిస్తున్నాయో వాటిని కట్ చేస్తున్నారు.
రెండు గంటల 50 నిముషాల ఫైనల్ రన్ టైమ్ వస్తే దాన్ని పదినిముషాలకు తగ్గించి రెండుగంటల నలభై నిముషాలకు కుదించేందుకు దిల్ రాజు, వంశీ పైడిపల్లి కుస్తీ పడుతున్నారు. ఈ వీకెండ్ కు ఆ పని పూర్తవుతుందని తెలుస్తోంది. అలాగే మే 1 న ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం రెండు ట్రైలర్స్ ని కట్ చేసి ఉంచారు. సాంగ్స్ కు పూర్ రెస్పాన్స్ వచ్చిన నేపధ్యంలో ట్రైలర్ పైనే దృష్టి పెడుతున్నారు. ట్రైలర్ వచ్చాక బజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘మే 9న సినిమా విడుదలవుతుంది. మే 9న అశ్వినీదత్‌గారి బ్యానర్ నుండి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి’ సినిమాలు వస్తే.. మా బ్యానర్ నుండి ‘ఆర్య, పరుగు’ చిత్రాలు వచ్చాయి. మాతో పాటు పివిపిగారు కూడా కలిసి నిర్మిస్తోన్న చిత్రమిది. వంశీ ఊపిరితో కలిపి 5 సినిమాలు చేస్తే అందులో నాతోనే 4 సినిమాలు చేశాడు.
ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఆలోచించి రేపు విడుదల వరకు చూస్తే వంశీ ఈ సినిమా కోసం మూడేళ్లుగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. తెలుగులో కంటెంట్ వైజ్‌గా కానీ.. మేకింగ్ వైజ్‌గా అద్భుతమైన సినిమా. వంశీ కథ చెప్పగానే అశ్వినీదత్, పివిపిగారితో జాయినై చేసిన సినిమా. మా నమ్మకం, టీం పడ్డ కష్టం మే 9న ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు.