గత రెండు రోజులుగా మీడియా సర్కిల్స్ లోనూ, ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వినపడుతున్న టాపిక్..బాలయ్య, కె ఎస్ రవికుమార్ చిత్రం ఆపేసారట. అదీ వైయస్ జగన్ వలన అని. నిజంగా ఈ వార్త నమ్మాలా వద్దా అనిపించే విషయమే. ఎందుకంటే అతి త్వరలో షూటింగ్ వెళ్లాల్సిన సినిమామ ఆగిపోవటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. తనకు నచ్చిన దర్శకుడు బోయపాటిని కూడా ప్రక్కన పెట్టి మరీ చేస్తున్న సినిమాని బాలయ్య ఎందుకు ఆపేస్తాడు..అదీ జగన్ వలన అంటే…
సినీ జనం చెప్పుకునేదాని ప్రకారం…ఈ సినిమాలో విలన్ పాత్రలు రాజా రెడ్డి, వైయస్ జగన్ లను పోలి ఉంటాయిట. వీటిని జగపతిబాబు చేత చేయిస్తున్నారట. జగపతిబాబు ఆల్రెడీ యాత్ర సినిమాలో రాజా రెడ్డి గా కనిపించారు. మరోసారి ఆయన చేత కొంచెం అటూ ఇటూలో అలాంటి పాత్రే వేయించాలని కోరికట. తాత కాలంలో జరగనది తన కాలంలో అయినా జరిపించాలని మనవడు చేసే ప్రయత్నాలను హీరో ఎలా తిప్పి కొట్టాడన్నది కథగా రాసుకున్నారట.
అయితే తెలుగుదేశం గెలుస్తుంది అన్న ఆలోచనలో రాసుకున్న కథ కావటంలో అప్పుడు బాలయ్య ఓకే అన్నారట. ఇప్పుడు వైయస్ జగన్ రావటంతో కావాలని ప్రభుత్వంతో తగువు పెట్టుకోవటం ఎందుకని బాలయ్య భావించి ఆపేయించారట. అయితే కే ఎస్ రవికుమార్ ..పూర్తిగా విలన్ పాత్రలను మార్చి తీసుకువస్తానని తన టీమ్ తో కూర్చున్నారట. మొత్తానికి వైయస్ జగన్ గెలవటం బాలయ్యకు ఈ విధంగానూ సమస్య తెచ్చి పెట్టిందంటున్నారు.