టాలీవుడ్ లో తొలి సినిమాతోనే కుర్రకారును తన చుట్టూ గిర్రున తిప్పుకున్న బ్యూటీ రాశీఖన్నా తెలుగులో పాపులర్ హీరోయినే తప్ప, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ హీరోల చూపుల్లో పడకపోవడంతో.. మీడియం రేంజ్ హీరోలతోనే కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఒకచోట టాప్ అనిపించుకుంటే తప్ప, పరభాషా చిత్రాలకు ప్రమోషన్ రాదన్న విషయాన్ని ముందే గ్రహించిన ముద్దుగుమ్మ.. అవకాశమిచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే ఆ స్థాయి అందుకునే ప్రణాళికలు వేసుకుందట. పెద్ద సినిమాల కోసం ఆశపడేకంటే.. ఒపిగ్గా ఎదురు చూడటమే సరైన సూత్రమని నమ్ముతోన్న రాశి, అందుకు అనుగుణంగా అడుగులేస్తూ వస్తోంది. ఒపిగ్గా ఎదురుచూస్తే తన టైం వచ్చినపుడు పెద్ద సినిమాలు దొరక్కపోతాయా? అన్నది రాశి యోచన. అందుకే పక్కచూపులు చూడకుండా తెలుగు ఇండస్ట్రీలోనే ఫిక్సవడానికీ ప్రయత్నిస్తోందట. హైదరాబాద్‌లో ఆవాసం ఏర్పర్చుకున్న రాశి, డబ్బింగ్ సమస్య రాకుండా తెలుగునూ పుక్కిటపట్టింది. విడుదలకు సిద్ధమవుతున్న వెంకీమామలో సొంత గొంతు వినిపించే అవకాశం రాకున్నా, తరువాత రాబోయే ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల్లో సొంత గొంతు వినిపించటానికి సన్నద్ధమైందట. ఏదోకరోజు తెలుగుకి స్టార్ హీరోయిన్ల కొరత తప్పదని గ్రహించిన రాశి.. స్టార్ హీరోలకు సూటయ్యే స్లిమ్ ఫిజిక్‌లోకి మారింది. ఆమె నమ్మకం నిజమై.. ఎదురుచూపులు ఫలించి పెద్ద సినిమాల్లో ఒకట్రెండ్ చాన్స్‌లు దొరికినా.. రాశి ఫేట్ మారిపోయినట్టే. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటి వర్కౌటైనా కొత్త ఏడాదిలో పెద్ద సినిమా పడక పోతుందా? అని రాశి ఆశపడుతోంది. అదీ సంగతీ! అల్ ది బెస్ట్ ఖన్నా!!