రేస్‌లో విజయ్ దేవరకొండ రేంజ్ ఇదే !?

విజయ్ దేవరకొండ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ రేస్‌లో రేంజ్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్‌తో భిన్నమైన ప్రేమకథతో బిజీగా ఉన్నాడు. నలుగురి హీరోయిన్లతో ప్రణయ గాథను చూపించనున్న విజయ్ చిత్రానికి దర్శకుడు క్రాంతిమాధవ్. ఇప్పటికే నలుగురితో రొమాంటిక్ స్టిల్స్ విడుదల చేయించి, తనదైన స్టయిల్లో సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు విజయ్. వచ్చే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున సినిమా థియేటర్లకు రానుందన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తాజాగా ఆసక్తికర ప్రాజెక్ట్ ప్రకటించారు విజయ్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం చేస్తున్నాడన్నది ప్రకటన సారాంశం. దిల్‌రాజు పుట్టినరోజునే అధికారిక ప్రకటన వెలువడింది. హీరో నానికి ‘నిన్నుకోరి’ లాంటి క్లాసిక్ అందించిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ ఏడాది నాగచైతన్యతో మజిలీ చేసి మరో హిట్టందుకున్నాడు. ఇప్పుడు విజయ్- దిల్‌రాజుల చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ కావడంతో -కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఏదేమైనా విజయ్ మంచి ఊపుమీదున్నాడు.