కియారా జోరుమీదుంది!?

టాలీవుడ్ లో “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామా” తో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఢిల్లీ భామ కియారా అద్వాని. ఇప్పుడు బాలీవుడ్‌లో భారీ అవకాశాలతో దూసుకుపోతోంది . ఈమె కథానాయికగా నటించిన కబీర్‌సింగ్ (‘అర్జున్‌రెడ్డి’ రీమేక్) మూడొందల కోట్ల క్లబ్‌లో నిలిచింది. “కెరీర్‌లో మొదటిలోనే అంత భారీ సినిమాలో భాగమవడం అదృష్టం. అయితే, కెరీర్ ఆరంభంలో అవకాశాల విషయంలో తీవ్రంగా నిరుత్సాహపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తొలి చిత్రం ‘ఫగ్లీ’ పరాజయం తో అవకాశాలు మృగ్యమైపోయాయి. ఓ దశలో ఎటు తోచక ఇంటివద్దనే ఉండిపోయేదాన్ని. భవిష్యత్తు ఎలా ఉంటుందో? అనే సందిగ్ధం వెంటాడేది. ఆ సమయంలో ‘అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. అన్వేషణ ఆపకూడదు. ప్రయత్నాలు ఏదో ఒకరోజు ఫలిస్తాయి’ అంటూ అమ్మ చెప్పిన మాటలు నాలో స్ఫూర్తినింపాయి. ప్రస్తుతం నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. నా గమ్యమేమిటో ఇంకా నిర్ణయించుకోలేదు కానీ.. ఈ ప్రయాణాన్ని మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తున్నా” అని చెప్పింది కియారా. “నాలుగు చిత్రాల్లో నటించడంతోపాటు మరో నాలుగు చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించిన ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ‘కబీర్‌సింగ్‌’, ‘కళంక్‌’ వంటి భిన్న చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని ఈ సంవత్సరం నాకు కల్పించింది. అనుకోని విధంగా ‘గుడ్‌న్యూస్’ విడుదలతో ఈ ఏడాది ముగుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని అంటోంది. ఈ ఏడాది తెలుగులో ‘వినయ విధేయ రామా’ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో మూడు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది . అంతేకాదు, పలు భారీ ఆఫర్లు సైతం అందుకుంది. ప్రస్తుతం ‘లక్ష్మీబాంబ్‌’, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్‌ భులయ్య 2’, ‘షేర్‌షా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. “నాలుగు చిత్రాల్లో నటించడంతోపాటు మరో నాలుగు చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించిన ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు కూడా చాలా మంచి చిత్రాలు. పైగా కరణ్‌జోహార్‌లాంటి నిర్మాత బ్యానర్‌లో చేయడం నా కెరీర్‌లో పెద్ద విజయం” అంటూ కైరా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.