కేంద్ర కేబినెట్లో వైసిపి చేరనుందా? 

ys jagan rethinking about dissolving of legislative council
వారం రోజుల క్రితం ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి హోమ్ మంత్రి అమిత్ షా ను వరుసగా రెండుసార్లు కలవడం పచ్చమీడియా గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.  ఆ ఆక్రోశాన్ని తట్టుకోలేక అమిత్ షా జగన్ను మందలించాడని, క్లాస్ పీకాడని కథలు రాసి స్వయంతృప్తిని పొందిన సంగతి మనకు తెలుసు.  వారి కడుపుమంటను ద్విగుళం బహుళం చేయడానికా అన్నట్లు జగన్ రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలియడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా కలవరపడుతున్నట్లు సమాచారం.  ఆయన భయానికి ముఖ్యకారణం ఇటీవల రాష్ట్ర బీజేపీలో సంభవించిన పరిణామాలే.
 
ys jagan rethinking about dissolving of legislative council
 
చంద్రబాబుకు బద్ధవిరోధి సోము వీర్రాజు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావడంతో పాటు బీజేపీలో ఉన్న చంద్రబాబు బానిసలను ఒకటి రెండు హెచ్చరికలతో నియంత్రించాడు.  తనకు అత్యంత విశ్వాసపాత్రులు, మహారాజపోషకులు అయినట్టి   నలుగురు రాజ్యసభ సభ్యుల శిరసులను ఖండించి మోడీ పాదాల వద్ద కానుకగా సమర్పించినా ఏడాది కాలంగా ఎలాంటి ఫలితమూ లేకపోయింది.  అలాగే రాష్ట్రంలో తన బంటుల్లా వ్యహరిస్తూ పార్టీని కుంగదీస్తున్న కన్నా లక్ష్మీనారాయణ, లంకా దినకర్ లాంటి కోవర్టులను వీర్రాజు దిగ్విజయంగా తప్పించగలిగాడు.  చంద్రబాబుకు  అనుకూలంగా ఎలాంటి ప్రకటన చేసినా తల వెయ్యి ముక్కలు అవుతుందనే  సంకేతాలను పంపించినప్పటికీ, కేంద్ర పెద్దలు మౌనం వహించడం, తనకు ఢిల్లీలో  అనుకూలంగా వ్యవహరించే వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ లాంటివారి నోళ్లను కుట్టెయ్యడం కూడా చంద్రబాబుకు దిక్కు తోచకుండా చేసింది.  

విశ్వసనీయతకు మారుపేరు జగన్ 

ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల వ్యవధిలో జగన్ మోహన్ రెడ్డి రెండోసారి  హస్తినకు వెళ్లనుండటం, మోడీతో కలిసే అవకాశం కూడా ఉన్నదని వార్తలు రావడం తెలుగుదేశం పార్టీ అరికాళ్లకింద భూకంపం పుట్టిస్తోంది.   వైసీపీతో స్నేహం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒకవేళ పొత్తు కుదిరితే వైసిపినుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నదని చెప్పుకుంటున్నారు.  చంద్రబాబుకు సింహస్వప్నంగా గర్జనలు గావిస్తున్న వైసిపి భీష్ముడు విజయసాయిరెడ్డికి కేబినెట్ మంత్రి పదవి దక్కుతుందని గుసగుసలు.  పార్లమెంట్ లో ఇరవై ఎనిమిది మంది సభ్యుల బలాన్ని కలిగిన వైసీపీతో పొత్తు తమకు మేలు చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కలిగిన నాయకుడని, మాట తప్పేవాడు కాదని మోడీ నమ్మకం.  తాము తెలుగుదేశంతో పొత్తు కొనసాగించిన సమయంలో కూడా మోడీని, అమిత్ షా ను జగన్ వ్యక్తిగతంగా విమర్శించిన ఉదంతాలు లేవు.  తద్భిన్నంగా తమతో నాలుగేళ్లు పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రిపదవులు అనుభవించి, మైత్రికి భంగం కలగగానే చంద్రబాబు మోడీని, అమిత్ షాను ఎన్ని దుర్భాషలాడారో, మోడీని రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని హోర్డింగులు పెట్టించడం, అమిత్ షా తిరుపతి పర్యటనలో ఆయన కాన్వాయ్ మీద రాళ్లు వేయించడం,  మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాక, మోడీ ఓటమికోసం దేశమంతా తిరిగి ప్రచారం చెయ్యడం లాంటి సంఘటనలు బీజేపీ పెద్దల రక్తాన్ని మరిగిస్తున్నాయని బీజేపీ నాయకులు గురుతు చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపాలంటే తెలుగుదేశం లేదా వైసిపి సహకారం లేకుండా బీజేపీకి సాధ్యం కాదు.  అందుకే వచ్చే ఎన్నికలనాటికి కనీసం అయిదారు  స్థానాలైనా గెల్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం అవుతుందని బీజేపీ పెద్దలు విశ్వసిస్తున్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ తో పొత్తు అంటే ఒట్టిపోయిన పొడుగు నుంచి పాలు పిండుకోవడం లాంటిదే అని కూడా మోడీ, షాలకు అర్ధమైపోయింది.     

రాష్ట్రానికి కూడా అవసరమే 

ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు దూరం అవుతారని వైసిపిలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.    ఈ వాదనలో ఏమాత్రం పస లేదు.  బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మైనారిటీలు ఓట్లు వెయ్యకుండా ఓడించింది లేదు.    బీజేపీతో దూరం అయినతరువాత ఓట్లు వేసి గెలిపించింది లేదు. మైనారిటీలు ఒకప్పటిలా కేవలం  మతప్రాతిపదిక మీద ఓట్లు వెయ్యడం లేదు.   కాలంతో పాటు వారు కూడా మారుతున్నారు.  రామజన్మభూమి వివాదం, బాబ్రీ మసీదు కూల్చివేత మీద తీర్పు తరువాత కూడా ముస్లిమ్స్ ఆందోళనకు, హింసకు పాల్పడకుండా ఎంతో సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే హింస కన్నా శాంతి మేలు అని వారు భావిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.   జగన్ తమకు మేలు చేస్తాడని నమ్మకం ఉంటే, చేసిన పనులు బాగున్నాయని భావిస్తే జగన్ ఎవరితో వెళ్లినా ఎవ్వరూ దూరం కారు.  వైసిపితో పొత్తు ఉన్నంతమాత్రాన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.   రాష్ట్రంలో ప్రస్తుతానికి వైసిపికి ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీయే.  దానికి సీట్లు తక్కువ వచ్చి ఉండవచ్చు.  కానీ ఓట్ల శాతం మెరుగ్గానే ఉంది.  దాన్ని దెబ్బతియ్యడం వైసిపికి కూడా అవసరమే.  

ఎవరో ఒకరితో కలవకపోతే ఎలా? 

రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు.  రాబోయే రెండు మూడేళ్ళలో వైసిపి బలం పదికంటే ఎక్కువకు పెరుగుతుంది.  కనుక నమ్మకమైన, పటిష్టమైన సంఖ్యాబలం కలిగిన వైసీపీతో పొత్తు బీజేపీకి కూడా లాభమే.  రాబోయే రోజుల్లో   దేశాన్ని పాలించేది ఎన్డీయే లేదా యూపీఏ కూటమి మాత్రమే.  మరో కూటమి లేదా పార్టీ పొడుచుకొస్తుందని నమ్మకం కుదరడం లేదు.  కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరడం అంటే వైసిపికి ఆత్మహత్యసదృశమే.  అది ఎన్నటికీ జరిగే పని కాదు.  ఇక మిగిలింది ఎన్డీయే కూటమి మాత్రమే.  ఎన్డీయే నుంచి కూడా మిత్రపక్షాలు విడాకులు తీసుకుంటున్నాయి.  అందువలన వారికి కూడా మిత్రపక్షాల అవసరం ఉన్నది. కేంద్రంలో కూడా అధికారం కావాలంటే ఎన్డీయే తో కలవక తప్పదు.  ఇద్దరికీ దూరంగా ఉంటే ఈ జన్మలో వైసిపికి కేంద్రంలో అధికార భాగస్వామ్యం దక్కదు.  

ప్రతికూలతలను అధిగమించాలంటే…

ప్రస్తుతం వైసిపికి రాష్ట్రంలో రాజకీయంగా అన్ని మూలలనుంచి గండాలే కనిపిస్తున్నాయి.  కోర్టులు జగన్ మీద నిప్పులు చిమ్ముతున్నాయి.  ఇక తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు అందరూ దూరంగానే ఉన్నారు.  జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి.   సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలంటే నిధులు, అప్పులు అవసరం.  కేంద్రఅధికారంలో భాగస్వామ్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డికి సానుకూలతలు పెరుగుతాయి.  ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి చాణక్యుడు కేంద్ర మంత్రిగా ఉంటే అనేక అద్భుతాలు సంభవిస్తాయి.  అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు, రాజధాని వికేంద్రీకరణకు, రాజధాని నిర్మాణానికి విజయసాయిరెడ్డి చక్రం తిప్పగలరు.  

విజయసాయి రెడ్డి లాంటి మేధావి సేవలు అనివార్యం 

YSRCP MP Vijay Sai Reddy

చివరిగా చెప్పేదేమిటంటే…కేంద్రంలో వైసిపికి రెండో మూడో పదవులు దక్కాయంటే..సైకిల్ శాశ్వతంగా షెడ్డుకు వెళ్లడం ఎవరూ ఆపలేరు.  అలాగే ఇప్పటికే భళ్ళున బద్దలైన గాజు గ్లాసు రజను కూడా మిగలకుండా మాయమైపోతుంది.  ఇప్పటికే రాష్ట్ర బీజేపీ జగన్ మీద దాడిని పూర్తిగా తగ్గించింది.  టీవీ చర్చల్లో బీజేపీ అధికారప్రతినిధులు జగన్ చర్యలను మెచ్చుకుంటున్నారు.  సాక్షాత్తూ ప్రధానమంత్రే జగన్ పాలనాసామర్ధ్యానికి మెచ్చుకోలు పలికిన విషయం నెమరు వేసుకుంటే వైసిపి కేంద్ర కేబినెట్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేంద్రంలో ఒక్కరే సహాయమంత్రిగా ఉన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో  విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరు తెలుగువారు కేంద్రంలో మంత్రులు అయితే, ఆ వైభవమే వేరుగా ఉంటుంది.  కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న సత్సంబంధాల రీత్యా  అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రయోజనమే.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు