YSRCP Sweeps Andhra Pradesh Municipal Elections
ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు…ఈ నగరం ఆ నగరం అని లేదు…ఈ పట్టణం ఆ పట్టణం అని లేదు…ఎందెందు వెదకి చూసిన అందందే గలదు వైసిపి అన్నట్లు…ఆకలిగొన్న సింహం ఈ జంతువో అని చూడకుండా వేటాడినట్లు…వైసిపి రాష్ట్రం మొత్తం వీరవిహారం చేస్తున్నది. వైసిపి విజయవిహారానికి అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు అస్సలు ఎక్కడా వైసిపికి నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వైసిపికి లభించిన సీట్లకు, తెలుగుదేశం, జనసేనలకు లభించిన సీట్లకు ఆకాశానికి అవనికి ఉన్నంత దూరం!
ప్రతి మునిసిపాలిటిలోనూ తొంభై అయిదు శాతం స్థానాలు వైసిపి దక్కించుకోగా మిగిలిన అయిదు శాతం కోసం విపక్షాలు అన్నీ పోరాడుతున్నాయి. వైసిపి అభ్యర్థులు గెలిచిన చోట మూడంకెలు, నాలుగంకెల ఆధిక్యత కనిపిస్తుండగా తెలుగుదేశం, జనసేన గెలిచిన చోట్ల కేవలం కొద్దీ పదుల ఆధిక్యత మాత్రమే కనిపిస్తున్నది. సత్తెనపల్లిలో కేవలం ఒక్క ఓటు మెజారిటీతో జనసేన గెలిచిందట. దానికి రీ కౌంటింగ్ కోరుతున్నది వైసిపి.
తిరుపతి, చిత్తూర్, నెల్లూరు, కర్నూల్, గిద్దలూరు, నాయుడుపేట, కనిగిరి, అద్దంకి, తుని…ఒకటేమిటి? రాష్ట్రం మొత్తం వైసిపి ప్రభంజనం దావానలంలా విస్తరించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అనబడే ఖండవవనాన్ని ఆహుతి చేసింది. అన్నింటికన్నా తెలుగుదేశం పార్టీని బెంబేలెత్తించింది గుంటూరు కార్పొరేషన్ లో కూడా వైసిపి ఘనవిజయాన్ని సాధించడం. మీకు సిగ్గులేదా, రోషం లేదా…అని చంద్రబాబు వాగిన పిచ్చివాగుడుకు జనం దీటైన సమాధానం ఇచ్చారు. అమరావతి అనేది చంద్రబాబు, ఆయన సామాజికవర్గంవారికి దోచిపెట్టడానికి తప్ప అది ప్రజారాజధాని కాదనేది గుంటూరు ఓటర్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం సిగ్గూశరం ఉన్నా ఆయన తక్షణమే రాజకీయాలనుంచి తప్పుకోవాలని గుంటూరు ఓటర్లు ముఖం మీద గుద్దినట్లు చెప్పారని ఒక వైసిపి నాయకుడు ఈ వ్యాసకర్తతో చెప్పారు.
మరొక విశేషం ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి దక్కిన ఓట్లశాతం కన్నా, ఈరోజు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దక్కిన ఓట్ల శాతం చాలా ఎక్కువ. గత రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి తనదైన సంక్షేమ పథకాలతో దూసుకునివెళ్తున్నందుకు దక్కిన ప్రతిఫలం ఇది. దుష్ట ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరూ సహకరించకపోయినా, మేధావులు అనేవారు జగన్మోహన్ రెడ్డిని ఎంత తూర్పారబట్టినా, ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల ద్వారా రుజువైంది. తమ మేలు కోసం అహర్నిశలు కష్టించే నేతను ప్రజలు ఆదరిస్తారని మరోసారి తెలియజేయబడింది.
చంద్రబాబు ఐదేళ్లు పాలించినా లక్షలకోట్ల అప్పులు మిగిల్చడం, తనవారికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో ముంచేయడం పట్ల ప్రజల ఆగ్రహం ఏమాత్రం చల్లారలేదు. అప్పులు చేసి తమ సంక్షేమం కోసం సద్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని వారు ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ రోజు వెలువడిన ఫలితాల కన్నా సాక్ష్యం ఏమి కావాలి? బీజేపీ పరిస్థితి మరీ ఘోరంగా దిగజారిపోయింది. ఎక్కడా ఆ పార్టీకి కనీసం పది ఓట్లు కూడా పడినట్లు లేదు. జనసేన అమలాపురంలో కొంత ప్రభావాన్ని చూపగలిగింది. తెలుగుదేశం కన్నా నయం అనిపించింది.
ఏతావాతా చూస్తే ఇక రాబోయే పదిహేనేళ్ళు కూడా జగన్మోహనంగానే ఉంటుందని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవారు, దూషించేవారిని ప్రజలు ఎంతమాత్రమూ క్షమించబోరని ఈనాటి నగరపాలక సంస్థల ఫలితాలు తేటతెల్లం చేశాయి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు