ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం దృష్టికి ఇంకోసారి తీసుకెళ్ళారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నిన్నటి భేటీలో ప్రత్యేక హోదా అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందట. ఈ ప్రత్యేక హోదా చుట్టూనే కీలకమైన చర్చ కూడా ఇరువురి మధ్యా జరిగిందట. వైసీపీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారమిది. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదు. ఆ విషయాన్ని గతంలోనే కేంద్రం కుండబద్దలుగొట్టేసింది. పార్లమెంటు సాక్షిగా కూడా కేంద్రం పలుమార్లు ఈ విషయమై ప్రకటనలు కూడా చేసింది. అయితే, అదే పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది హక్కుగా సంక్రమించింది. మన్మోహన్ సర్కార్ ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే, దానికి మోడీ సర్కార్ మోకాలడ్డింది. ఇక్కడ ప్రధాని నోట చట్ట సభల్లో ప్రకటన.. అంటే, అది శిలాశాసనం లాంటిదే. కానీ, మోడీ సర్కార్ బేషజాలకు పోతోంది. కాంగ్రెస్ మీద పంతంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. గతంలో చంద్రబాబు, బీజేపీతో పొత్తుపెట్టుకున్న దరిమిలా, ప్రత్యేక హోదా ఎగ్గొట్టే విషయంలో బీజేపీకి సహకరించారు. మరి, వైఎస్ జగన్ ఏం చేస్తున్నట్లు.? గతంలో ఇదే ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించిన వైఎస్ జగన్, ముందు ముందు కూడా అలాంటి కీలక నిర్ణయమే ఇంకోసారి తీసుకుంటారా.? అంటే, పరిస్థితులు అందుకు ప్రేరేపిస్తే.. ఆ ముచ్చట కూడా తప్పదన్నది వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.
కానీ, ఏం చేసినా, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే కన్పించడంలేదు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుపోతూ, ప్రత్యేక హోదాపై వైసీపీ ఉద్యమిస్తే తప్ప.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కదు. కానీ, ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు చాలా చిత్రమైనవి. తెలంగాణ కోసం తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంతటి బలమైనది. అక్కడి రాజకీయ నాయకుల్లోనూ తెలంగాణ పట్ల అంతటి చిత్తశుద్ధి వుంది. కానీ, ఏపీ రాజకీయ నాయకుల్లో ఆ చిత్తశుద్ధి లేదు. అధికారమే పరమావధి తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికీ పట్టడంలేదు. అదే బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారిపోతోంది.