తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని వైసిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని నిరూపించడానికి కోర్టుల చుట్టూ తిరిగి విజయం సాధించి జరిపించిన పంచాయితీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం మెడచుట్టూ ఉరితాళ్లై బిగుసుకున్నాయి. మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు అధికార వైసిపిని ఏమాత్రం నియంత్రించలేక చివరకు రాజధాని జిల్లాల్లోనూ చతికిలపడి, అమరావతి ఉద్యమం అంతా బూటకపు ఉద్యమం అని యావద్దేశం తెలుసుకునేలా చేసింది. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినవి కావచ్చు గాక, కానీ వాస్తవంగా అవి పార్టీల మధ్యే అని అందరికీ తెలుసు. మొత్తం పదమూడువేల చిల్లర పంచాయితీ ఎన్నికలు జరగ్గా వైసిపి పదకొండువేలకు పైగా పంచాయితీలు గెల్చుకుని అసెంబ్లీ ఎన్నికల కన్నా తమ బలం ఇంకా పెరిగిందని రుజువు చేసుకుంది.
తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా వైసిపి మెజారిటీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది అంటే చంద్రబాబు నాయుడు ప్రభలు మసకబారాయని పిల్లలకు కూడా అర్ధం అవుతుంది. ఒకప్పుడు జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పి, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకుల మధ్యన చాణక్యుడిగా వెలిగిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు తన సొంతగ్రామం పంచాయితీ గెల్చుకుంటే అదే పెద్ద విజయమని పొంగిపోవాల్సిన దురవస్థ పట్టిందంటే తెలుగుదేశం పలుకుబడి ఏ పాతాళానికి దిగజారిపోయిందో అర్ధం కావడం లేదు. తెలుగుదేశంలో ఒకప్పుడు చండప్రచండంగా వెలిగిపోయిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని చవిచూడాల్సివచ్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూర్ వరకు వైసిపి కత్తికి ఎదురులేకుండా పోయింది. వైసిపి ఖడ్గప్రహార ప్రభావానికి తెలుగుదేశం కంచుకోటలన్నీ బ్రద్దలై కూలిపోయాయి. చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ లో కూడా తెలుగుదేశం కుదేలైపోయింది.
ఇక “జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వను”…”నేను ముఖ్యమంత్రిని అవుతాను” అంటూ ఎన్నికలవరకూ ప్రగల్భాలు పలికిన జనసేనాధిపతి ఈ ఎన్నికలు ఏమాత్రం జీర్ణించుకోలేనివే. పదమూడువేల పంచాయితీలలో పట్టుమని సొంతంగా పాతిక పంచాయితీలు కూడా సాధించలేక జనసేన ఛీత్కరించబడింది. దుకాణాన్ని పెట్టుకుని ఏడేళ్లు గడిచినా, ఇన్నాళ్లూ బానిస బతుకు బతికి, చంద్రబాబుకు తోకలా వ్యవహరించి ప్రజల్లో అభాసుపాలైన పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతో నెయ్యం కట్టి మరింత పరాభవించబడ్డాడు. పవన్ కళ్యాణ్ కు ఉన్న సినిమా ఇమేజ్ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని మరోసారి తేటతెల్లమైంది. ఆయన క్రౌడ్ పుల్లర్ తప్ప ఓట్ పుల్లర్ కాదని ఫుల్లుగా జనానికి తెలిసిపోయింది. పవన్ ను నమ్ముకుని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఆయన శక్తిసామర్ధ్యాలు ఎంత గొప్పవో అర్ధం అవ్వొచ్చు.
వైసిపి ఈ ఎన్నికల్లో ఇంత గొప్ప ఫలితాలను రాబట్టడం వెనుక జగన్మోహన్ రెడ్డి అకుంఠిత దీక్ష, పారదర్శకమైన పరిపాలన, గ్రామస్థాయిలో అవినీతి నిర్మూలన, వాలంటీర్ల సేవ, గ్రామసచివాలయాల ఏర్పాటు, సంక్షేమ పధకాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడం, పార్టీని నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తల కృషి సమధికంగా ఉన్నాయి. అన్నిటినీ మించి జగన్ మీద ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత మరో ముఖ్య కారణం. రేపటి మునిసిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి ఇవేరకమైన ఫలితాలను రాబట్టగలిగితే మరో పదేళ్లు ఆ పార్టీకి తిరుగుండదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు