2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు రాజమండ్రి ఎంపీ భరత్. రాజమండ్రి పరిధిలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల్ని ఇటీవల వైసీపీ అధినాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజమండ్రి అంటే, తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రాంతం. రాజమండ్రి నగరం, రూరల్.. ఇలా పలు నియోజకవర్గాలు కవర్ అవుతాయ్. వాటిల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం కూడా వుంది. జగ్గంపేట సహా పలు నియోజకవర్గాలూ అత్యంత కీలకం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో.
అయితే, వైసీపీ ఎంపీ మార్గాని భరత్ 2019 ఎన్నికల్లో గెలిచాక, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై పెత్తనం చెలాయించారన్న చర్చ ఊరూవాడా గట్టిగానే జరిగింది, జరుగుతూనే వుంది కూడా.!
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మధ్య అప్పట్లో నడిచిన ఆధిపత్య పోరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, మార్గాని భరత్ వైపే నిలబడ్డారు. కానీ, జక్కంపూడి కుటుంబంతో జగన్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్.
అసలు మార్గాని భరత్‌కి టిక్కెట్టే ఇవ్వొద్దంటూ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వైసీపీ శ్రేణుల నుంచి అధినాయకత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాక కూడా, ఆయన్ని అసెంబ్లీకి పంపాలని వైఎస్ జగన్ ఎలా నిర్ణయం తీసుకున్నారో ఏమో.! మార్గాని భరత్ ఇంపాక్ట్, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో చాలా తీవ్రంగా వుండబోతోందిట.. అదీ వైసీపికి వ్యతిరేకంగా.
అయితే, నాలుగున్నరేళ్ళలో ఆర్థికంగా బాగా బలోపేతమయిన మార్గాని భరత్, ఆ పార్లమెంటు పరిధిలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతని (వైసీపీ గెలుపు బాధ్యతని) తీసుకుంటాడన్న నమ్మకంతోనే జగన్ ఆయనకు సీటిచ్చారని తెలుస్తోంది.
కానీ, భరత్ దెబ్బ వైసీపీకి గట్టిగానే వుండబోతోందన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట.