మొదట తమ పార్టీలో చేరి ఆ తర్వాత టిడిపి,ఆ మీదట బిజెపి ఇలా ప్రధాన పార్టీలు అన్నీ తిరిగి సరిగ్గా ఎన్నికల ముందు మళ్లీ వైసిపిలో చేరిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అదే పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు. ఏకులా వచ్చి మేకు అవడం అనే నానుడికి అర్థం ఏంటో అందరికీ అర్థం అయ్యేలా నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నాడు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలుపొందడంతో ఎవరైనా ఏముందిలే గుంపులో గోవిందా అనడమేగా?…అనే పరిస్థితి ఉండేది. అయితే కారణాలు ఏమైనా తొలుత పార్టీ నేతల మీద విమర్శనాస్త్రాలతో అసమ్మతి నేతగా అవతరించిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ఆ తరువాత ఇంతింతై వటుడింతై లాగా రెబల్ గా మారి చివరకు పార్టీలో తనకు ఎదురేలేదనుకున్న అధినేతకే ఛాలెంజ్ విసిరే దాకా వెళ్లారు. ఇంత జరుగుతున్నా ఆయన్ని ఏ దశలోనూ అడ్డుకోలేక మహా శక్తివంతుడిగా భావిస్తున్నఆ పార్టీ అధ్యక్షుడితో సహా వైసిపి చేష్టలుడిగి చూస్తుండటం సహజంగానే హాట్ టాపిక్ అవుతోంది.
ఎంత డ్యామేజ్ చేస్తున్నాడంటే…
శాసన సభ సీట్లతో పాటు లోక్ సభ సీట్లను అత్యధిక సంఖ్యలో గెల్చుకొని ప్రతిపక్షాలకు దుర్భేధ్యమైన కోటలా కనిపిస్తున్న వైసిపిని చిరకు సొంత పార్టీ ఎంపినీ నాన్ స్టాప్ గా బీటలు బారేలా మోదిపారేస్తున్నాడు. సంఖ్యాబలంలో విపక్షాల విమర్శలను పూచికపుల్లలా తీసిపారేస్తూ అతిశయ ఆనందంలో తేలిపోతున్న వైసిపి తమకు ఇక ఎదురులేదని భావించింది. అయితే అనూహ్యంగా తమ పార్టీ ఎంపీనే తమకు పక్కలో బల్లెంలా మారి నేలమీదకు దింపే ఇలాంటి పరిస్థితి వస్తుందని వైసిపి నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. సొంత పార్టీ నేతల మీదే అవినీతి విమర్శలతో మొదలెట్టి ఆ తర్వాత అదీ ఇదీ అని లేకుండా అవకాశం దొరికిన ప్రతి అంశంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ కంట్లో నలుసుగా మారాడు ఈ రెబెల్ ఎంపి. ఆయన తీరుపై ఆగ్రహించి పార్టీ ఏమైనా చర్య తీసుకుంటే అందుకు ఈ ఎంపి గారి ప్రతిచర్య “తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపుచెక్కతో నేను రెండిస్తా” అన్న చందంగా ఉంటూ కొరకరాని కొయ్యలా మారిన పరిస్థితి.
ఏమీ చెయ్యలేమా రెడ్డి గారు…
సొంత పార్టీనే రఫ్ ఆడిస్తున్న రఘురామకృష్ణంరాజును మిగతా మీడియా పట్టించుకోకపోయినా తమ అవసరాల దృష్ట్యా ఎల్లో మీడియా ఫుల్ గా హైలెట్ చేస్తుండటం వైసిపికి అంతకంత డ్యామేజ్ చేస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం లోనే ప్రాణాలకు రక్షణ లేదంటూ కేంద్ర బలగాలను రప్పించుకోవడం, అలాగే ఏకంగా పార్టీ అధినేత సామాజిక వర్గానికే అమిత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నిలదీయడం, పార్టీ ఎంపీ అయి వుండి తమ ముఖ్యమంత్రి పరిపాలనలో లోటుపాట్లు అంటూ జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా అక్కడ మీడియాలో వచ్చేలా చేయడం, ఇప్పుడు ఏకంగా అమరాతి విషయమై తన రాజీనామాతో ముడిపెడుతూ సిఎం జగన్ నే ఆయన అభిమతానికి విరుద్దంగా నిర్ణయం తీసుోమని ఛాలెంజ్ విసిరేంతవరకూ వరకూ రఘురామకృష్ణంరాజు వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా అతడు సినిమా డైలాగ్ స్టయిల్లో అతన్నిప్పుడు ఏమీ చెయ్యలేమా రెడ్డి గారూ అనుకోవాల్సిన పరిస్థితి.
బ్రేకప్ మాత్రమేనా…ఫుల్ స్టాఫ్ పెట్టేదుందా?
షోకాజ్ నోటీస్ తో భయపెడదామని చూస్తే దాన్నే ఆధారం చేసుకొని వైసిపికి రివర్స్ షాట్ రుచి చూపించిన రఘురామకృష్ణరాజు…అదీఇదీ అని లేకుండా వివిధ అంశాలతో వైసిపిని చెడుగుడు ఆడేస్తుండగా…ఇతడి డ్యామేజ్ ను ఇలా భరించాలని వైసిపి శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇలా ఇతడి దాడిని భరిస్తూ పోవడమేనా…లేక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేదేమైనా ఉందా?…అది సాధ్యమేనా?…సాధ్యమైతే ఎందుకు చేయలేకపోతున్నారు…సాధ్యం కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి?…అంటూ కార్యకర్తల నుంచి పైదాకా తమ పైస్థాయి నేతలను నిలదీస్తున్న పరిస్థితి. మరి ఎంపీపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి అధినాయకత్వం బీజేపీ పెద్దల ద్వారా అతనిపై చర్యలు తీసుకోవాలని…ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించాలని…అదే ఈ సమస్యకు పరిష్కారం అని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా ఏమీ చేయలేని వైసిపి అధినాయకత్వం అది మాత్రం చేయగలదా అనేదే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.