వైఎస్‌ జగన్‌ దగ్గర బీజేపీ పప్పులుడుకుతాయా.?

ysrcp facing Criticism

‘కేంద్రం నిధులు ఇస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వమేమో ఆ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ, కేంద్రం ఏమీ చేయడంలేదనే అర్థం లేని ప్రచారానికి దిగుతోంది..’ అనే పరమ రొటీన్‌ వాదనను బీజేపీ ఇంకోసారి బలంగా తెరపైకి తెచ్చింది. చంద్రబాబు హయాంలోనూ బీజేపీ చేసింది ఇదే ప్రచారం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ బీజేపీ అదే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ – బీజేపీ గతంలో పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి.. ఆ ప్రచారం వర్కవుట్‌ అయ్యింది అప్పట్లో. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. బీజేపీకి వైసీపీతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. పరోక్ష సంబంధాల గురించి భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. అది వేరే సంగతి.

ysrcp facing Criticism

కేంద్రం ఏమిచ్చింది.? రాష్ట్రం ఏం చేసింది.?
కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని నిధులు ఇచ్చినా.. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడంలో కేంద్రం తగిన సహకారమైతే అందించలేదన్నది నిర్వివాదాంశం. అమరావతి విషయంలోనూ కేంద్రానికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం, రాష్ట్ర ప్రభుత్వమే పెద్దయెత్తున నిధుల్ని ముందస్తుగా ఖర్చు చేయాల్సి వచ్చింది. వైఎస్‌ జగన్‌ హయాంలో పరిస్థితి కొంత తారుమారయ్యింది.. రివర్స్‌ టెండరింగ్‌ వంటి వ్యవహరాలతో ప్రాజెక్టు నిర్మాణంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ, రాజధాని పేరు చెప్పి కేంద్రం, వైఎస్‌ జగన్‌ హయాంలో కొత్తగా విడుదల చేసిన నిధులెక్కడ.? ఏమన్నా అంటే, రాష్ట్ర రాజధానిపై వైసీపీకే చిత్తశుద్ధి లేదని బీజేపీ చెబుతోంది.

కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సిందే..
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా వేరుపడి, పాత పేరుతో కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ఆర్థిక లోటు సహా అనేక అంశాల్లో కేంద్రం ‘తొండి’ వ్యవహారాలు నడిపింది. నిజానికి, పెద్దన్న పాత్ర పోషించి.. దేశంలోని మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్ళేలా తగిన తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఎందుకంటే, కేంద్రమే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. పైగా, అడ్డగోలు విభజన.. అంటూ నరేంద్ర మోడీ సహా చాలామంది బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలూ చెబుతూనే వున్నారు ఇప్పటికీ.

జగన్‌ దగ్గర పప్పులుడకవ్‌.?
‘మా జగన్‌ వద్ద మీ పప్పులుడకవ్‌’ అంటున్నారు వైసీపీ నేతలు, బీజేపీని ఉద్దేశించి. అది కొంతవరకు నిజమే కావొచ్చు. కానీ, చాలా విషయాల్లో కేంద్రానికి తలొగ్గాల్సి వస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కేంద్రం, రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా, ‘సర్దుకుపోతున్నారు.. సహకరిస్తున్నారు..’ అనే విమర్శని అయితే వైసీపీ ఎదుర్కొంటూనే వుంది. అయితే, ఖచ్చితమైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నామనీ, అభివృద్ధి – సంక్షేమం అనే ఎజెండాతో దూసుకెళుతున్నామనీ, ఈ క్రమంలో ఒక్కోసారి ‘తగ్గాల్సి’ వస్తుందనీ, దాన్ని చేతకానితనంగా భావిస్తే.. పరిణామాలు తీవ్రంగా వుంటాయని వైసీపీ, బీజేపీని హెచ్చరిస్తోంది.