మునిసిపోల్స్‌లో వైసీపీ విక్టరీ.. ఊహించిందేగానీ.!

YSRCP Establishment day

YSRCP Establishment day

మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఏకగ్రీవాల పరంగా ఇప్పటికే జోరు ప్రదర్శించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లోనూ సత్తా చాటుతోంది. అక్కడక్కడా టీడీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ, జనసేన ప్రభావం చాలా తక్కువ చోట్ల కనిపిస్తోంది. వామపక్షాలు, కాంగ్రెస్ గురించి చెప్పుకోవడం అనవసరం అన్నట్టు తయారైంది పరిస్థితి.

అయితే, మునిసిపల్ ఎన్నికల్లో ఈ తరహా ఫలితాలు అంతా ఊహించినవే. ఏడాది క్రితం నామినేషన్లు.. ఇప్పుడు ఎన్నికలు.. ఈ మధ్యకాలంలో చాలా జరిగాయ్. అభ్యర్థులు పార్టీలు మార్చేశారు. దాంతో, ఎన్నికల వ్యవహారమంతా ఏకపక్షం అయిపోయింది. ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏయే పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకున్నా.. అంతిమంగా ‘కుర్చీ’ మాత్రం వైసీపీకే దక్కబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అందులో నిజం లేకపోలేదు కూడా. ఎందుకంటే, ఏ పార్టీ అధికారంలో వున్నా, చివరి నిమిషంలో మునిసిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ల మేయర్ పదవులకు వచ్చేసరికి.. ఫిరాయింపులు పెద్దయెత్తున్న నడుస్తాయి.

అయితే, ఇక్కడ ఓటింగ్ శాతం ఎంత.? అన్నది కీలకం కాబోతోంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేశాం.? ఎన్ని గెలిచాం.? ఎన్ని ఓడిపోయాం.? ఎన్ని ఓట్లు సాధించాం.? అన్నదానిపై ఆయా రాజకీయ పార్టీలు భవిష్యత్ రాజకీయ వ్యూహాల్ని రచించుకోవాల్సి వుంటుంది. కాగా, ‘మాకు ఓటేస్తే, సంక్షేమ పథకాలు మీకు రావు..’ అని అధికార పార్టీ చేసిన హెచ్చరికలు అటు పంచాయితీ ఎన్నికల్లో ఎలా సత్ఫలితాలనిచ్చాయో, ఇప్పుడు ఈ మునిసిపల్ ఎన్నికల్లోనూ అలాంటి సత్ఫలితాలనే ఇచ్చాయన్నది ఇంకో వాదన. డబ్బు, మద్యం, బహుమతులు.. ఇలాంటివన్నీ ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారాలే. ఇప్పుడూ అవి జరుగుతున్నాయి. అయితే, అంతిమంగా గెలుపోటములే లెక్క. ఆ లెక్కన, అధికార వైసీపీ మునిసిపల్ ఎన్నికల్లో తిరుగులేని ఫలితాల్ని సాధించినట్లే లెక్క.