ఒడిషాతో వైసీపీ గొడవ : వ్యూహాత్మక తప్పిదమే.!

YSRCP clash's with Odisha

పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఆంధ్రపదేశ్‌కి సన్నిహిత సంబంధాలు వున్నాయా.? లేదా.? అన్నదానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వివాదాలున్నాయి. ఆయా రాజకీయ పార్టీలకు అవసరమైనప్పుడు ఈ వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రపదేశ్, తెలంగాణ మధ్య అప్పుడప్పుడూ రాజకీయ వివాదాలు తారాస్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక, తమిళనాడులతో పెద్దగా వివాదాల్లేవు ఆంధ్రపదేశ్‌కి. అయితే, ఒడిషాతో మాత్రం సరికొత్తగా వివాదాలు తెరపైకొస్తున్నాయి. సరిహద్దుల్లోని కొటియా అనే గ్రామం విషయంలో వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఆంధ్రపదేశ్‌లోకి ఒడిషా చొచ్చుకువచ్చిన మాట వాస్తవం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోతుండడంతో సరిహద్దు గ్రామమైన కొటియా సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా వుంటే, విశాఖ స్టీల్ ప్లాంటు విషయమై ఒడిషా పేరుని తెరపైకి తెస్తున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇది రాజకీయంగా వ్యూహాత్మక ఎత్తుగడ.. అన్నది స్థానికంగా వినిపిస్తోన్న వాదన. నిజానికి, ఒడిషాతో ఏపీకి పలు విషయాల్లో పంచాయితీ వుంది.

YSRCP clash's with Odisha
YSRCP clash’s with Odisha

విశాఖ కేంద్రంగా ఏర్పడబోతున్న రైల్వే జోన్ విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఒడిషాకి కొన్ని అభ్యంతరాలున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా, ఏపీకి తరచూ అన్యాయం జరుగుతుంటుంది కాబట్టి, పైన చెప్పుకున్న చాలా వ్యవహారాల్లో ఒడిషాకి మద్దతు పెరుగుతూ, ఏపీకి మరింత అన్యాయం జరుగుతోంది. ఒడిషా అభ్యంతరాల్లేకపోతే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఈ పాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి వుండేదే. నిజానికి, ఈ వివాదాలు ఇప్పుడు కొత్తగా పుట్టినవి కావు.. ఏళ్ళ తరబడి పాలకుల నిర్లక్ష్యంతో ఇరు రాష్ట్రాల మధ్య తగాదాల స్థాయికి చేరాయవి. అయినాగానీ, ఉత్తరాంధ్రలో ఒడిషా ప్రజలకీ, ఒడిషాలో వున్న తెలుగువారికీ.. ఎప్పుడూ ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి లేదు. కానీ, స్టీల్ ప్లాంట్ విషయమై ఒడిషా దోపిడీ.. అనే అంశాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పదే పదే ప్రస్తావిస్తుండడంతో ఉత్తరాంధ్రలో అలజడి కన్పిస్తోంది. అదే సమయంలో ఒడిషాలోని తెలుగువారూ ఈ చెత్త రాజకీయంపై ఆందోళన చెందుతున్నారు.