లోకేష్‌ను నిర్వీర్యం చేయడానికి పెద్ద ప్లానే వేసిన వైసీపీ, బీజేపీ

Nara Lokesh
దెబ్బ మీద దెబ్బ పడితే ఎవరికైనా నడ్డి విరగాల్సిందే.  ఒక దెబ్బ నుండి కోలుకునే లోపు రెండో దెబ్బ వేస్తే లేవడం దాదాపు కష్టం.  ఈ ఫార్ములానే గట్టిగా ఫాలో అవుతున్నారు వైసీపీ నేతలు.  అది కూడా తెలుగుదేశం విషయంలో.  2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమిని రుచి చూపించి టీడీపీని పాతాళానికి తొక్కిన వైసీపీ ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతల అరెస్టులు అంటూ చంద్రబాబును ఇరకాటంలో పడేశారు.  ఎన్నికల్లో అంతటి ఓటమిని చవిచూసిన బాబు తక్షణమే పార్టీని గాడిలో పెట్టే పని మొదలుపెట్టాలని అనుకున్నారు.  కీలక నేతలతో సమీక్షలు కూడా ప్రారంభించారు.  ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించారు.  కానీ ఈలోపే వైసీపీ రెండో దఫా దాడి ఆరంభించి అచ్చెన్నాయుడు, జేసీ లాంటి వారిని జైలుకు పంపింది.
ysrcp bjp
 
ఈ పరిణామంతో పార్టీని చక్కదిద్దుకునే చర్యలను పక్కనపడేసి స్వీయ రక్షణలో పడ్డారు చంద్రబాబు అండ్ కో.  అరెస్టుల పర్వం మొదలయ్యాక ఇదిగో నెక్స్ట్ బబుగారే, ఆ తర్వాత లోకేష్ బాబే, తర్వాతి టర్న్ గంటాదే, దేవినేని ఉమాదే అంటూ అవంతి లాంటి వైసీపీ కీలక నేతలు పదే పదే అంటుండటంతో నేతలు ఎవరికి వారు తమని తాము రక్షించుకోవడంలో బిజీ అయిపోయారు.  ఇక బాబు, లోకేష్ ఇద్దరూ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షించే వారే కరువైపోయారు.  ఇదే అదునుగా భావించిన వైసీపీ మూడో ప్లాన్ షురూ చేసింది.  అదే టార్గెట్ లోకేష్.  మొదటి నుండి లోకేష్‌ను తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్న వైసీపీ ఆ పనిని బాగానే నిర్వరించింది.  లోకేషే టీడీపీకి భవిష్యత్ లీడర్ కాబట్టి అతన్ని ఇప్పటి నుండే బలహీనపరిస్తే రానున్న రోజుల్లో టీడీపీని హ్యాండిల్ చేయడం ఈజీ అనుకున్నారు వైసీపీ వాళ్లు. 
 
ఆ పనిని నెంబర్ 2 నేత విజయసాయిరెడ్డి భుజానికెత్తుకున్నారు.  లోకేష్ రాజకీయాలకు అసమర్థుడు అని ప్రజల్లో భావన కలిగేలా ప్రచారం చేశారు.  తెలుగు సరిగా మాట్లాడలేకపోవడం, ఎకధాటి వాక్చాతుర్యం ప్రదర్శించలేకపోవడం లాంటి వాటిని కూడా హైలెట్ చేసి ఏకంగా పప్పు అనే మారుపేరు పెట్టి దారుణమైన రీతిలో అయన ప్రతిష్టను దెబ్బతీశారు.  మొత్తంగా ప్రజల్లో ఆయన్ను ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు.  ఫలితంగా లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు.  భవిష్యత్తులో కూడా వైసీపీ సృష్టించిన దృష్ట ప్రభావం నుండి తప్పించుకోవడం లోకేష్‌కు పెద్ద సవాలే అవుతుంది.  ఇన్నాళ్లు జరిగిన ఈ దాడి మొత్తం పరోక్ష దాడి.  ఇప్పుడు ప్రత్యక్ష దాడి షురూ చేస్తున్నారు.  
 
లోకేష్ పార్టీలో అరెస్టుల పర్వం మొదలైన దగ్గరనుదగ్గర్నుండి యాక్టివ్ అయ్యారు.  వైసీపీ నేతల చర్యలను, విమర్శలను తిప్పికొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  అందుకోసం షోసల్ మీడియాను ప్రధాన వారధిగా వాడుకుంటున్నారు.  బయటికి వచ్చే వీలు లేకపోవడంతో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.  ప్రజల్లో వాటికి రీచ్ కూడా ఉంటోంది.  అందుకే దానికి అడ్డుకట్టవేయాలని భావించిన వైసీపీ మంత్రి బాలినేని ద్వారా లోకేష్‌కు నోటీసులు పంపారు.  కొన్ని రోజుల క్రితం చెన్నై సరుహద్దుల్లో భారీగా దొరికిన పత్రాలు లేని నగదు బాలినేనికి చెందినదేనని గట్టి ప్రచారం జరిగింది.  బాలినేని వాటిని ఖండించారు.  లోకేష్ ఆ ఇష్యూ మీద బాగానే విమర్శలు గుప్పించారు.  అవన్నీ నిరాధారమని అంటూ బాలినేని లోకేష్‌కు, ఇంకొందరికి నోటీసులు పంపారు.  
 
ఈ చర్య చూస్తే భవిష్యత్తులో కూడా వైసీపీ నేతల మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అర్థమవుతోంది.  ఇక వైసీపీకి బీజేపీ కూడా తోడైంది.  తమపై అసత్య ప్రచారం ఎక్కువైందన్న భారతీయ జనతా పార్టీ ఇకపై అలాంటి ప్రచారాన్ని సహించేది లేదన్న రాష్ట్ర బీజేపీ ఎవ్వరినీ వదలబోమని అన్నారు.  వైసీపీకి బీజేపీకి మధ్యన దోస్తీ బాగుంది.  జనసేన ఎలాగూ బీజేపీకి మిత్రపక్షమే.  మరి ఈ హెచ్చరికలు ఎవరికి అంటే మిగిలిన టీడీపీకే.  ఇన్నాళ్లు టీడీపీ బీజేపీ మీద పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు.  అయినా బీజేపీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఎందుకు అంటే టీడీపీని టార్గెట్ చేయడానికేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.  మరి ఈ చర్య వెనుక ఎవరున్నారయా అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.