రాజకీయ నాయకులకు ఇదేం సరదానో.! సోషల్ మీడియాలో ట్వీట్లేయడం.. తిట్టించుకోవడం కొందరు నేతలకు అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షం అన్నాక, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఈ క్రమంలో అడ్డగోలు ‘రెట్టలకు’, అదేనండీ ట్వీట్లకు సోషల్ మీడియా వేదికవుతుండడమే హాస్యాస్పదం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ‘డెమోక్రటిక్ ఇంబాలన్స్’ అన్న ప్రస్తావనకు అర్థం చెబుతూ, కుల సమీకరణాల్ని ప్రస్తావించారు. ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్పులో కాలేశారన్నది నిర్వివాదాంశం. దాన్ని దెప్పిపొడుస్తూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీటేశారు. ఇంకేముంది.? నారా లోకేష్‌ని ఏకిపారేశారు వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా. ‘ముందు నువ్వు పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం పేరుని సరిగ్గా పలుకు..
జయంతికీ వర్ధంతికీ తేడా తెలుసుకో..’ అంటూ లోకేష్‌పై మండిపడ్డారు వైసీపీ అభిమానులు. లోకేష్ వేసిన ట్వీట్‌కి పాజిటివ్ కామెంట్స్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చి పడ్డాయి. నిజానికి, ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలేమో. ఎక్కువమంది తిట్టినా, ఎక్కువమంది పొగిడినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆ మాటకొస్తే, పొగడ్తల కంటే తిట్ల ద్వారా వచ్చే ఫాలోయింగ్ ఎక్కువ. బహుశా అందుకే, తిట్టించుకోవడానికి నారా లోకేష్ ఎక్కువ ఆసక్తి చూపుతుంటారేమో. మీడియా ముందుకొచ్చి ఆయా విషయాలపై మాట్లాడాలంటే నారా లోకేష్ అయినా తడబడిపోతారు. ఒక్కోసారి నోటి వెంట బూతులు కూడా వచ్చేస్తుంటాయి.. అది నోరు తిరగక వచ్చే సమస్య.
ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తక్కువేమీ కాదు. ఒకప్పటి రాజకీయ నాయకులు వేరు, ఇప్పటి రాజకీయ నాయకులు వేరు. అందరూ ఆ గుంపులోని వారే అయినప్పుడు, ఒకరి లోపాల్ని ఇంకొకరు ఎత్తి చూపుకోవడమెందుకు.? పైగా, ఇదేమన్నా జాతి సమస్యా? జాతీయ సమస్యా.? లోకేష్ ప్రవచనాలపై వైసీపీ యుద్ధం ప్రకటించేస్తే.. దాన్ని కవర్ చేయలేక తెలుగు తమ్ముళ్ళు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకోపక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ట్రోలింగ్ చూసి వైసీపీ శ్రేణులకూ కష్టంగానే వుందనుకోండి.. అది వేరే సంగతి.